పార్లమెంటులో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఖండించారు. కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ విషయం తెలుసుకోకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. మహిళల సంక్షేమం కోసం ఒక్కరోజు కూడా ఆమె మాట్లాడింది లేదని అన్నారు. తెలంగాణ అంగన్ వాడీల్లో ముతక బియ్యం ఇస్తున్నారా? అని కాంగ్రెస్ నేత ఉత్తమ్ ఓ ప్రశ్న అడిగారని, దానికి కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ అవగాహన లేకుండా సమాధానం చెప్పారని మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. తెలంగాణలో అంగన్ వాడీలకు ముతక బియ్యం ఇస్తున్నట్లు అబద్దం చెప్పారన్నారు. అవసరమైతే విచారణ చేస్తామన్నారు. టీఆర్ఎస్ పార్టీని, ప్రభుత్వాన్ని బద్నాం చేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు.


Integrated Child Development Services - ICDS పై కేంద్ర ప్రభుత్వానికి ఒక పాలసీ లేదని సత్యవతి రాథోడ్ విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం త్వరలో దీనిపై ఓ మంచి పాలసీ తీసుకురాబోతోందని అన్నారు. గతంలో అంగన్ వాడీల్లో సిబ్బందిని వర్కర్లు అని పిలిచే వాళ్ళకు టీచర్లుగా తెలంగాణ ప్రభుత్వం కల్పించిందని గుర్తు చేశారు. బాలమృతం ద్వారా న్యూట్రీషియన్ ఫుడ్ ఇస్తున్నామని, గిరిపోషణను అదనంగా ఇస్తున్నామన్నారు. ఈనెలలో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌ను ప్రారంభిస్తున్నామని మంత్రి తెలిపారు.


‘‘అంగన్ వాడిలలో ఎప్పుడూ గోధుమలు ఇవ్వలేదు ఇప్పుడు కూడా ఇవ్వడం లేదు. బాలామృతం గురించి స్మృతీ ఇరానీని కలిసి స్వయంగా లేఖ ఇచ్చాను. రాజకీయాల కోసం టీఆరెస్ పార్టీ ప్రభుత్వాన్ని బదనామ్ చేసేందుకే స్మృతీ ఇరానీ వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి తన పార్లమెంట్ పరిధిలో జరుగుతుంది ఏంటో కనీస పరిజ్ఞానం లేకుండా ప్రశ్నలు అడుగుతున్నారు. వెనుకబడిన జిల్లాలకు మంచి పోషకాహారాల కోసం లేఖ రాస్తే రెండు జిల్లాలకే ఇచ్చారు. టీఆరెస్ పది జిల్లాలకు ఇస్తోంది. గిరి పోషణ పేరుతో త్వరలో గర్భిణీలకు ప్రోగ్రాం అమలు చేయబోతున్నాం. ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన సమాధానం చూసుకోకుండా పార్లమెంట్ లో మంత్రి అబద్ధాలు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న ఆరోగ్యలక్ష్మీ దేశంలోనే ప్రత్యేకమైన కార్యక్రమం. అంగన్ వాడి టీచర్లకు ఇచ్చే జీతంలో కేంద్రం 2 వేలు రూపాయలు మాత్రమే. కేంద్రాన్ని ఎన్నిసార్లు అడిగినా తెలంగాణకు పూర్తిస్థాయి సహకారం అందడం లేదు.’’ అని అన్నారు.


రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ అభివృద్ధిని చూడలేక పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రులు అబద్ధాలు చెప్తున్నారు. గోబెల్స్ వారసత్వాన్ని బీజేపీ కేంద్రమంత్రులు కొనసాగిస్తున్నారు. స్మృతి ఇరానీకి మహిళలపై ప్రేమ ఉంటే నిజం ఒప్పుకొని క్షమాపణ చెప్పాలి.’’ అని అన్నారు. 


ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి మాట్లాడుతూ.. ‘‘మహిళలకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. స్మృతి ఇరానీ ఎప్పుడైనా అంగన్ వాడిలకు వెళ్ళారా అనిపిస్తోంది ఆమె మాటలు వింటుంటే. కేంద్రం అంగన్ వాడిలకు ఇచ్చే జీతం కన్నా తెలంగాణ ప్రభుత్వం నాలుగింతలు ఎక్కువ ఇస్తున్నాం. ఉన్నత విద్యలో బాలుర కంటే బాలికలు ఎక్కువగా ఉన్నారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా.’’ అని అన్నారు.