తెలంగాణ ఆర్టీసీ దూర ప్రాంతాలకు నడిపే ఉద్దేశంతో నేడు ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ప్రవేశపెట్టింది. ఈ ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను ‘ఈ - గరుడ’ పేరుతో పిలవనున్నారు. మొత్తం 10 ఈ - గ‌రుడ బ‌స్సుల‌ను నేడు (మే 16) మియాపూర్‌లోని పుష్పక్ ఎయిర్ పోర్ట్ లైనర్ బస్సుల ప్రాంతంలో ప్రారంభించారు. రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్‌, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవ‌ర్ధన్, ఎండీ వీసీ స‌జ్జనార్ తదితరులు జెండా ఊపి ఈ బస్సులను ప్రారంభించారు.


ఈ ఈ - గరుడ బస్సులను హైదరాబాద్ - విజయవాడ మార్గంలో తిప్పనున్నారు. ఈ మార్గంలో మొత్తం 50 బస్సులను నడపనున్నారు. వీటిలో నేడు 10 బస్సులను మియాపూర్‌లో ప్రారంభించారు. హైటెక్‌ హంగులతో మిగతా 40 బస్సులు కూడా అందుబాటులోకి వస్తే హైదరాబాద్‌- విజయవాడ మార్గంలో 20 నిమిషాలకు ఓ ఈ - గరుడ బస్సు నడిపేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లుగా టీఎస్ఆర్టీసీ సంస్థ ప్రకటించింది. రాబోయే రెండు సంవత్సరాల్లో కొత్తగా 1,860 ఎలక్ట్రిక్‌ బస్సులను అందుబాటులోకి తెస్తామని ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ - గరుడ బస్సు ఛార్జీని రూ.780 గా నిర్ణయించారు.


Also Read: Telangana Cabinet: ఈనెల 18న తెలంగాణ కేబినెట్ భేటీ, కొత్త సెక్రటేరియట్‌లో తొలిసారిగా


ఈ సంద‌ర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  మాట్లాడుతూ..  ఎలక్ట్రిక్ బస్సుల్లో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. ప్రయాణికులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. నవంబర్, డిసెంబర్ నాటికి ఇంకో 500 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకోస్తామని చెప్పారు. హైదరాబాద్ లో తిప్పడానికి త్వరలో 10 డబుల్ డెక్కర్ బస్సులను తీసుకొస్తామని అన్నారు. హైదరాబాద్ లో సిటీ బస్సులుగా ఎలక్ట్రిక్ బస్సులను వీలైనంత తొందరగానే అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. వాటిని మెట్రో స్టేషన్‌కు అనుసంధానం చేస్తామని వివరించారు.


ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జనార్ మాట్లాడుతూ.. హైద‌రాబాద్ - విజ‌య‌వాడ మ‌ధ్య ఇంట‌ర్ సిటీ ఎలక్ట్రికల్ బ‌స్సులు ప్రారంభించామ‌ని తెలిపారు. ఈ - గ‌రుడ బ‌స్సులో అత్యాధునిక సౌక‌ర్యాలు ఉంటాయ‌ని వివ‌రించారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో త్వర‌లో ఎల‌క్ట్రిక్, డ‌బుల్ డెక్కర్ బ‌స్సులు అందుబాటులోకి తెస్తామ‌న్నారు. త్వర‌లో 10 డ‌బుల్ డెక్కర్, 550 ఎల‌క్ట్రిక్ బ‌స్సులు ప్రారంభిస్తామ‌ని సజ్జనార్ చెప్పారు.


Also Read: Jogi Ramesh At Neera Cafe: హైదరాబాద్ నీరా కేఫ్ లో ఏపీ మంత్రి, టేస్ట్ అదిరిందన్న జోగి రమేష్