టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు డబుల్ కా మీటా ఇచ్చినమని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. కనీసం వారు కూడా ఊహించని విధంగా అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా సీఎం కేసీఆర్ చేశారని మంత్రి మల్లారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సీఎం చిత్రపటానికి బీఆర్ఎస్ నేతలతో కలిసి మంత్రి పాలాభిషేకం చేశారు.
ఉద్యోగులకు డబుల్ కా మీటా
‘‘ఆర్టీసీ ఉద్యోగులు కూడా మన బిడ్డలే, మన కార్మికులే అని చెప్పి మొన్న కేబినెట్ మీటింగ్ లో పెద్ద ఎత్తున డబుల్ కా మీటా, డబుల్ ధమాకా ఇచ్చినం. తాము ఇలా ప్రభుత్వ ఉద్యోగులు అవుతామని వాళ్లు కలలో కూడా ఊహించి ఉండరు. ఎప్పటికీ ఆర్టీసీలోనే ఉంటమని అనుకున్నరు. ఇయ్యల అందర్నీ ప్రభుత్వ ఉద్యోగులకు దీటుగా ప్రభుత్వంలో కలుపుకున్నం. సీఎం కేసీఆర్ మహాత్ముడు, ఆయన భగవంతుడి స్వరూపం. ఏది చేసినా గొప్ప పని చేస్తడు. ఆయన లెక్క ఎవ్వరు పని చేయలేరు.’’
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం ఎన్నికల స్టంటా? అని విలేకరులు ప్రశ్నించగా, ‘‘ఎన్నికల స్టంట్ అనుకో.. ఏదైనా అనుకోండి.. మాది రాజకీయ పార్టీ.. అని మంత్రి వ్యాఖ్యానించారు. ‘‘మాది రాజకీయ పార్టీ వయా.. ఎన్నికలనుకో ఏదన్నా అనుకో.. కార్మికులైతే న్యాయం జరిగిందా లేదా? వాళ్ల భవిష్యత్తు మంచిగా అయిందా లేదా? ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినయా లేదా? ఎన్నికలకు ఎట్లనన్నా పోతం, ఎన్నికల స్టంట్ ఉంటది. ఇది రాజకీయ పార్టీ. కానీ, చేసే దిల్, ధైర్యం కావాల. ఎంత ఫండ్స్ కావాలె. ఎంత ధైర్యం కావాల. అది మా కేసీఆర్ కే ఉంది’’ అని మాట్లాడారు.
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
ఘట్కేసర్ మున్సిపాలిటీలోని ఏమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో ఘట్కేసర్ మున్సిపాలిటీ, ఘట్కేసర్ మండలానికి తెలంగాణ ప్రభుత్వం తరుపున మంజూరు అయిన (17+9) షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం పోచారం మున్సిపాలిటీ పరిధిలోని శివాస్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ ప్రభుత్వం పోచారం మున్సిపాలిటీకి మంజూరు చేసిన షాదీ ముబారక్ కల్యాణలక్ష్మి (17) చెక్కులను లబ్ధిదారులకు పంపిణి చేశారు.
అలాగే నేషనల్ అకాడమీ అఫ్ కన్స్ట్రక్షన్ NAC ఆధ్వర్యంలో జరిగిన మహిళాలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన అర్హులైన దాదాపు 35 మంది కుట్టు శిక్షణ పొందిన మహిళాలకు కుట్టు మిషన్ లు అందజేశారు.