రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చే విషయంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. రైతులకు వ్యతిరేకంగా చేసిన ఈ వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకుంటుంది. ఈ క్రమంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డికి నిరసనగా నేడు బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. అధికారంలోకి రాక ముందే కాంగ్రెస్ తన నిజస్వరూపాన్ని బయటపెడ్డుకుందని మండిపడుతున్నారు. ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలను దహనం చేస్తున్నారు. రైతులకు మూడు గంటల ఉచిత విద్యుత్ చాలు అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ పోరు తీవ్ర తరం చేసింది. మంగళవారం పార్టీ నేతలంతా ఎక్కడికక్కడ ప్రెస్‌మీట్‌లు పెట్టి రేవంత్ వ్యాఖ్యలను ఖండించగా, నేడు (జూలై 12) రోడ్లపైకి వచ్చి ధర్నాలు రాస్తా రోకోలు చేశారు.
ఈ నిరసనల్లో రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాయలేని విధమైన పదాలు వాడుతూ దూషించారు. రేవంత్ రెడ్డి తనను కూడా బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాశనం అయిపోతుందంటూ ఎద్దేవా చేశారు. ఒక దొంగకు పీసీసీ పదవి ఇచ్చారంటూ మాట్లాడారు.