తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి ప్రధాని మోదీపై విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు. ద్రవ్యోల్బణాన్ని, దేశంలోకి జరుగుతున్న అక్రమ చొరబాటును ఏ మాత్రం అడ్డుకోలేకపోతున్న ప్రధాని నరేంద్ర మోదీని ఏమని పిలవాలంటూ కామెంట్లు చేశారు. అలాగే మీరైతే ఏమని పిలుస్తారంటూ నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. ఎ. 56 ఇంచెస్, బి. విశ్వగురు, సి. అచ్చే దిన్ వాలే, డి. పైన పేర్కొన్నవన్నీ.. అంటూ అన్ పార్లమెంటీ పదాలు కాబట్టి తొలగించారంటూ తీవ్రంగా ట్వీట్ చేశారు.
అంతేకాక, టీఆర్ఎస్ లోని కీలక నేతలు పుట్టా విష్ణువర్థన్ రెడ్డి, క్రిషాంక్ చేసిన ట్వీట్లను కూడా కేటీఆర్ రీట్వీట్ చేశారు. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఆయన గురించి మహిళలు ఏమనుకుంటున్నారో చూడాలని పుట్టా విష్ణువర్థన్ రెడ్డి చేసిన ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేశారు.
టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ మరో ట్వీట్ చేస్తూ.. కేంద్ర ప్రభుత్వం 5 శాతం విధించడం మొదలుపెట్టాక, అమూల్ సంస్థ మజ్జిగ ప్యాకెట్ ధర పెంచిందని సంబంధిత ఫోటో ట్వీట్ చేశారు. అచ్చే దిన్ అంటే ఇదేనా మోదీజీ అంటూ క్రిషాంక్ చేసిన ట్వీట్ ను కేటీఆర్ రీట్వీట్ చేశారు.
అంతేకాక, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా అనేక మంది వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ చేసిన ట్వీట్లను కేటీఆర్ రీట్వీట్ చేశారు.