బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో బదులిచ్చారు. నాగర్ కర్నూల్ సభలో పాల్గొనేందుకు వచ్చిన నడ్డా ఆ సందర్భంగా ఇష్టారీతిన మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ జైల్లో పెడతామని, ధరణి వ్యవస్థను తీసేస్తామని చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. గత కొన్నేళ్లలో కేసీఆర్ తో పెట్టుకున్న ఏ నాయకుడు బాగుపడినట్లు లేదని తేల్చి చెప్పారు. సోమవారం (జూన్ 26) ఉప్పల్ కూడలిలో నిర్మించిన స్కై వాక్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. 


ఉప్పల్‌ స్కై వాక్‌ ను ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ అందిస్తున్నందుకు కేసీఆర్ ను జైలులో పెట్టాలా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ కిట్లు, రెండు పడక గదుల ఇల్లు ఇస్తున్నందుకా? అని నిలదీశారు. జేపీ నడ్డా ఈ మాటలు మాట్లాడడానికి ఓ హద్దు అదుపూ అనేది ఉండాలని అన్నారు.


గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కరెంట్‌ కష్టాలు ఉన్నాయని గుర్తు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని చెప్పారు. ఎండా కాలంలో నీటి సమస్య లేకుండా ఇబ్బందులను సీఎం కేసీఆర్‌ పరిష్కరించారని అన్నారు. నారపల్లి నుంచి ఉప్పల్‌ వరకు రహదారి నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్‌ సమస్యలు తీరతాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే నాలుగేళ్ల నుంచి రహదారుల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని ఆరోపించారు.


కాంగ్రెస్, రేవంత్ రెడ్డిపైనా విమర్శలు
అవినీతి గురించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మాట్లాడితే పులి శాకాహారం గురించి మాట్లాడినట్లేనని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఒక హంతకుడే తాను చేసిన హత్యకు సంతాపం తెలిపినట్లు ఉంటుందని వ్యాఖ్యానించారు. రూ.50 లక్షల నోట్ల కట్టలతో దొరికి జైలుకెళ్లొచ్చిన వ్యక్తి చెప్పే నీతి ముచ్చట్లను మనం వినాలా? అని నిలదీశారు. కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో జాప్యంతో ఎంతో మంది ఉద్యమకారులు చనిపోయారని, దానికసోనియాగాంధీ కారణం కాదా? అని ప్రశ్నించారు. 9 ఏళ్లలో ఒక్కో పని చేసుకుంటూ హైదరాబాద్, తెలంగాణను అభివృద్ధి చేసుకుంటున్నామని.. పేదలను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నామని చెప్పారు. ఈ విషయాలను ప్రజలంతా గమనించాలని కేటీఆర్‌ కోరారు.


ఉప్పల్ స్కైవాక్ ప్రారంభం
ఉప్పల్ కూడలిలో రద్దీ ఎక్కువైనందున రోడ్లు దాటేందుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే పాదచారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా రోడ్డు దాటేందుకు ఉప్పల్ చౌరస్తాలో రూ.36.50 కోట్ల ఖర్చుతో స్కైవాక్ నిర్మించారు. ఈ స్కైవాక్ ను ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం (జూన్ 26) ప్రారంభించారు. ప్రయాణికలు రామంతాపూర్ నుంచి ఉప్పల్ వైపు.. ఉప్పల్ వైపు నుంచి రామంతాపూర్ వైపు.. నాగోల్ వైపు నుంచి హబ్సీగూడ వైపు.. హబ్సీగూడ వైపు నుంచి నాగోల్ వైపు పాదచారులు స్కైవాక్ ద్వారా భద్రంగా రోడ్డు దాటొచ్చు.