Minister KTR on Agneepath Scheme: కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగంలో కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపైన మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శలు చేశారు. అగ్నిపథ్ లో భాగంగా శిక్షణ పొంది, నాలుగేళ్ల పాటు సేవలు అందించి రిటైర్ అయిన ‘అగ్నివీర్’ లు తర్వాత ఎలా ఉపయోగపడతారనే అంశంపై బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ సెటైర్లు వేశారు. ప్రధాని మోదీని అర్థం చేసుకోలేకపోతున్నారని యువతను బ్లేమ్ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం ఉదయం కేటీఆర్ వరుస ట్వీట్లు చేశారు.


‘‘అగ్నిపథ్ స్కీం ద్వారా రిటైర్ అయి బయటికి వచ్చిన యువత అగ్నివీర్‌లు డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు, బార్బర్లు (క్షురకులు), వాషర్ మెన్ (రజకులు) గా ఉద్యోగాలు దక్కుతాయని ఎన్డీఏ గవర్నమెంట్‌లో ఓ కేబినెట్ మినిస్టర్ వ్యాఖ్యానించారు. ఇంకో మేధావి అయిన బీజేపీ లీడర్ అగ్నివీర్‌లని బీజేపీ ఆఫీసులో సెక్యూరిటీ గార్డులుగా నియమించుకుంటామని అన్నారు. మరి మోదీజీ మిమ్మల్ని అర్థం చేసుకోలేదని యువతను నిందిస్తున్నారా?’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఓ జాతీయ మీడియా సంస్థ పబ్లిష్ చేయగా, ఆ కథనాన్ని కూడా కేటీఆర్ రీ ట్వీట్ చేశారు.






అగ్నివీర్ లపై కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి రెండు రోజుల క్రితం వివాదాస్పద వ్యాఖ్య‌లు చేశారు. అగ్నిప‌థ్ కింద రిక్రూట్ అయిన అగ్నివీర్ ల‌కు ప‌లు ర‌కాల స్కిల్స్ నేర్పిస్తామ‌ని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు. అవి ఏంటో ఆయన వివ‌రించారు. మిల‌ట‌రీలో డ్రైవ‌ర్స్‌, ఎల‌క్ట్రిషియ‌న్స్‌, బ‌ట్ట‌లు ఉతికేవారు, హెయిర్ క‌ట్ చేసేవాళ్లు అని.. ఇలా వేల పోస్టులు ఉంటాయ‌ని తెలిపారు. అందులో అగ్నిప‌థ్ కింద రిక్రూట్ అయిన వారిని ఉప‌యోగించుకుంటామ‌ని చెప్పారు. కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. దేశ వ్యాప్తంగా మీడియాలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి.






మరోవైపు, బీజేపీ నేత విజయవర్గీయ కూడా వివాదం రేపే తరహాలో వ్యాఖ్యలు చేశారు. రిటైర్ అయి బయటికి వచ్చిన అగ్ని వీర్‌లను అవసరమైతే బీజేపీ ఆఫీసులో సెక్యురిటీ గార్డులుగా నియమించుకుంటామని అన్నారు.