హైదరాబాద్ నగర వాసులకు మంత్రి కేటీఆర్ శుభవార్త వినిపించారు. మెట్రో విషయంలో త్వరలోనే ఎల్బీ నగర్ నుంచి నాగోల్ మధ్య దూరాన్ని మెట్రోతో లింకు చేస్తామని వెల్లడించారు. ఓఆర్ఆర్ చుట్టూ 159 కి.మీ. మెట్రో రూట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. భూసేకరణ లేకుండా, అతి తక్కువ ఖర్చుతో దీన్ని ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. హైదరాబాద్ లో మొత్తం 314 కిలో మీటర్ల మెట్రో మార్గం అందుబాటులోకి తెస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. జీవో నెం.118 కింద రెగ్యులరైజ్ చేసిన పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కచ్చితంగా అధికారంలోకి వస్తుందని.. పనిచేసే ప్రభుత్వాన్ని, పనికొచ్చే ప్రభుత్వాన్ని ప్రజలు వదులుకోరని మంత్రి అన్నారు. ప్రజలు మళ్లీ గెలిపించుకుంటారనే విశ్వాసం ఉందని అన్నారు. ఆ నమ్మకం వల్లే 415 కిలో మీటర్ల మేర మెట్రో నిర్మాణానికి ప్రణాళికలు చేశామని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్ వచ్చే 50 నుంచి 100 ఏళ్లలో ఎంతగా అభివృద్ధి చెందినా సరే ఇబ్బందులు తలెత్తకుండా మెట్రో రైలు నిర్మాణం చేపడుతున్నట్టుగా మంత్రి కేటీఆర్ వివరించారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న 70 కిలో మీటర్ల మెట్రో రైలు మార్గం, నిర్మాణ దశలో ఉన్న ఎయిర్ పోర్టు మెట్రో 31 కిలో మీటర్లు కాకుండా, ఇంకో 314 కిలోమీటర్ల మెట్రోకు సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చారని అన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఎల్బీ నగర్ నియోజక వర్గంలోని నాగోల్ నుంచి ఎల్బీ నగర్ మార్గాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ మీదుగా ఓఆర్‌ఆర్ వరకూ మెట్రోను తీసుకెళ్తున్నామని వివరించారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల పాటు రాజకీయాలు చేస్తే చాలని, మిగతా నాలుగున్నర ఏళ్లు అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు ఏం చేయాలనే దానిపైనే దృష్టి పెడితే బావుంటుందని అన్నారు.