Bro Movie Controversy : బ్రో సినిమాలో తనపై సెటైర్లు వేయటాన్ని సీరియస్‌గా తీసుకున్నారు మంత్రి అంబటి రాంబాబు. తనకు ఎలాంటి కోపం లేదంటూనే పవన్‌పైన, ఈ సినిమా యూనిట్‌పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పవన్ పై బయోపిక్ తీస్తానంటూ నిన్న ప్రకటించిన అంబటి తన పోరాటాన్ని ఢిల్లీస్థాయికి తీసుకెళ్లాలని భవిస్తున్నారు. 


బ్రో సినిమా లావాదేవీలపై దర్యాప్తు చేయాలంటూ కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయనున్నారు. ఇవాళ రాత్రికి ఆయన ఢిల్లీ చేరుకుంటారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంట్ సమావేశాల కోసం వెళ్లి అక్కడే ఉన్న ఎంపీలతో కలిసి దర్యాప్తు సంస్థలకు అంబటి ఫిర్యాదు చేయనున్నట్టు తెలుస్తోందీ. 


జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన 'బ్రో' రాజకీయ రగడకు కారణమైంది. సినిమాలో శ్యాంబాబు క్యారెక్టర్ ఏపీలోని అధికార పార్టీకి చెందిన నేత, మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu)ను ఉద్దేశించి సృష్టించిన పాత్ర అని, శ్యాంబాబును తిట్టడం ద్వారా పరోక్షంగా గతంలో ఓసారి అంబటి చేసిన నృత్యాలపై విమర్శలు చేశారని పలువురు భావిస్తున్నారు. 


శ్యాంబాబు అని ఎందుకు? నేరుగా రాంబాబు అని పెట్టుకోవచ్చని 'బ్రో' విడుదలైన రోజున అంబటి రాంబాబు తెలిపారు. తనది ఆనంద తాండవం అని వివరించారు. మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన... 'బ్రో' ఫ్లాప్ అని తేల్చేశారు. అంతేకాదు పవన్ ఇచ్చిన డబ్బులతోనే ఈ సినిమా తీశారని ఆరోపించారు. తాను కూడా పవన్‌ జీవిత చరిత్రపై సినిమా తీస్తానని వీలైతే వెబ్‌సిరీస్‌ తీస్తానంటూ కామెంట్ చేశారు. అక్కడితో ఆగిపోని అంబరి రాంబాబు... ఎవరైనా తమను కెలుకుతూ సినిమాలు తీస్తే తగిన గుణపాఠం చెబుతామని కూడా సినిమా ఇండస్ట్రీని హెచ్చరించారు. 
పవన్ తీసుకున్న కోట్ల రూపాయల పారితోషికం కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు. అంతే కాదు... నిర్మాత టీజీ విశ్వప్రసాద్ (రాజకీయ నేత టీజీ వెంకటేష్ కజిన్) తెలుగుదేశం పార్టీకి చెందిన మనిషి అని, 'బ్రో' నిర్మాణం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చే ప్రక్రియ కొనసాగుతోందని, పవన్ కళ్యాణ్ కు ఇవ్వాల్సిన ప్యాకేజీని చంద్రబాబు ఈ రూపంలో అందించారని ఆరోపణలు చేశారు.


అంబటి కామెంట్స్‌పై టీజీ విశ్వప్రసాద్ ఫైర్‌ 
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Remuneration)కు ఎన్ని కోట్లు ఇచ్చామనేది తాము బయట పెట్టమని టీజీ విశ్వప్రసాద్ స్పష్టం చేశారు. అంబటి రాంబాబు చేసిన ఆరోపణల్లో వాస్తవాలు లేవని టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. 'బ్రో' సినిమా బ్లాక్ బస్టర్ అని ఆయన ఘంటా పథంగా చెప్పారు. ఓటీటీ రైట్స్ అమ్మడం ద్వారా తమకు మంచి డబ్బు వచ్చిందని వివరించారు. సినిమా వల్ల తమకు లాభాలు వచ్చాయన్నారు. వసూళ్లు బాగా వస్తున్నాయన్నారు. అంబటి ఆరోపించినట్లు 'బ్రో' చిత్ర నిర్మాణంలో మనీ రూటింగ్ ఏదీ జరగలేదన్నారు. సక్రమంగా సినిమా తీశామని స్పష్టం చేశారు. 


పవన్ కళ్యాణ్ వల్ల 'బ్రో' సినిమాకు క్రేజ్ వచ్చిందని చెప్పిన టీజీ విశ్వప్రసాద్... ఈ రాజకీయ విమర్శలను తాము ఊహించలేదని వివరించారు. మంచి లేదా చెడు... సినిమాకు పబ్లిసిటీ అవసరమని, అయితే తాము కోరుకొని పబ్లిసిటీ ఇదని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. 'ప్రస్తుతం టీజీ వెంకటేష్ కుటుంబం తెలుగు దేశం పార్టీలో ఉంది కనుక రాజకీయ విమర్శలు వస్తున్నాయని భావిస్తున్నారా?' అని ప్రశ్నించగా... తనకు అన్ని పార్టీల్లో మిత్రులు ఉన్నారని సమాధానం ఇచ్చారు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial