Pawan Kalyan: తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో కచ్చితంగా జనసేన జెండానే ఎగురుతుందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు. అక్కడ సీటూ మనదే, గెలుపూ మనదే అని చెప్పుకొచ్చారు. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ ను గెలిపించడం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం అని ప్రజలకు సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో క్లిష్టమైన సమయంలో నాదెండ్ల మనోహర్ అసెంబ్లీని ఎంతో సమర్థంగా నడిపించిన విధానం ఆయనలోని నాయకత్వ పటిమను, రాష్ట్రం పట్ల ఆయనకున్న నిబద్ధతను వెల్లడించాయన్నారు. అటువంటి సమర్థ నాయకుడినీ, ఎన్నుకున్న నియోజకవర్గం అభివృద్ధి పట్ల ఉన్న చిత్తశుద్ధిని తెనాలి ప్రజలు ఎప్పటికీ మరచిపోరు అని చెప్పారు. మంగళవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో తెనాలి నియోజకవర్గ పార్టీ నాయకులతో జనసేనాని, పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆత్మీయంగా సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులందరినీ నాదెండ్ల జనసేనానికి పరిచయం చేశారు.
అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. " మనోహర్ తన హయాంలో చేసిన సేవలను తెనాలి నియోజకవర్గం ప్రజలు విస్మరించలేదు. ఇప్పటికీ నియోజకవర్గం అభ్యున్నతి కోసం తపిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెనాలికి ఆయన అవసరం ఉంది. జనసేన పార్టీ ఎప్పుడూ ప్రజల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి కోసం ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఇందుకు భిన్నంగా పాలక పక్షం ఆలోచిస్తుంది. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కాని పోదు అంటారు.. ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు... నేను బాగుండాలి.. నేనే బాగుపడిపోవాలి అనేది వైసీపీ నాయకుడికి పుట్టుకతో వచ్చిన బుద్ది. దాన్ని నేనెప్పుడో గ్రహించాను కాబట్టే మొదటి నుంచీ వైసీపీని వ్యతిరేకిస్తున్నాను. ప్రజలు మాత్రం ఎంతో సానుభూతితో తండ్రి లేని పిల్లాడు.. సంవత్సరం నుంచి నడుస్తున్నాడని జాలితో ఓట్లు వేశారు. ఇప్పుడు దానికి ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపపడుతున్నారు. వైసీపీ పాలనతో పదడుగులు వెనక్కి వెళ్లిపోతున్నాం" అంటా కామెంట్లు చేశారు.
తండ్రి లేని పిల్లాడని మాత్రమే పిల్లలు జగన్ ను సీఎం చేశారని.. పవన్ కల్యాణ్ అన్నారు. ఏడాది పాటు పాదయాత్ర చేయడంతో కూడా అతడిపై జనాలకు జాలి కల్గిందని ఫలితంగానే అతడు ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పారు. అయితే ప్రస్తుతం పాలన చూస్తున్న ప్రజలకు మాత్రం అతడిని గెలిపించి వృథా అయిందని స్పష్టం చేశారు. అలాగే అర్ధశాస్త్రంలో పన్నులను ఎలా విధించాలనే అంశంపై నిపుణులు చెబుతూ.. 'పూల మీద మకరందం తీసుకునే సీతాకోక చిలుకలా ప్రభుత్వం పన్నుల విషయంలో వ్యవహరించాల'ని తెలిపారు. రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదని... చెత్తపైనా పన్ను వేసిన ప్రభుత్వం ఇదంటూ విమర్శించారు. ప్రజలపై ఇబ్బడి ముబ్బడిగా పన్నులు వేస్తూ, ఆ డబ్బుతో సంక్షేమం అంటే ఎలా అని ప్రశ్నించారు. ఓ పద్ధతి లేకుండా వైసీపీ చేస్తున్న పాలన వల్ల రాష్ట్రం పది అడుగులు వెనక్కు వెళ్తుందన్నారు. ప్రజలు కులం, మతం, ప్రాంతం దాటి ఆలోచించకపోతే పూర్తిగా రాష్ట్ర ప్రజల ఉనికికే ప్రమాదం వచ్చే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ పాలనపరమైన ఇబ్బందులు అలాగే ఉన్నాయని చెప్పారు.
నిజాయతీగల వ్యక్తుల సమూహం జనసేన : నాదెండ్ల
పార్టీలో నిజాయతీనే బలంగా చేసుకున్న నాయకులే కనిపిస్తారని నాదెండ్ల మనోహర్ అన్నారు. అరమరికలు లేకుండా అందరినీ కలుపుకొని వెళ్లేలా పనిచేయాలని సూచించారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగితే... విజయం మనదేనని చెప్పారు. అలాగే ప్రస్తుతం కొత్త ఓట్ల చేర్పులు, మార్పులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ ఆయా నియోజకవర్గాల్లో ఓట్లను తనిఖీ చేయమని అన్నారు. ఇంటింటి తనిఖీ అవసరం ఉందని.. తెనాలి నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధిని అందరూ గుర్తు చేసుకుంటారన్నారు. వచ్చే జనసేన ప్రభుత్వంలో తెనాలి నుంచి గెలిస్తే నియోజకవర్గంలో అద్భుతమైన పనులు ఎలా చేస్తామో ప్రజలకు తెలియచేద్దామని చెప్పారు.
ఎవరికీ మనశ్శాంతి లేదు: తెనాలి నియోజకవర్గం నాయకులు
ఈ సమావేశానికి హాజరైన తెనాలి నియోజకవర్గం నేతలు వివిధ అంశాలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ వర్గానికి మనశ్శాంతి లేదని అన్నారు. ఆఖరికి ఆ పార్టీ తరఫున గెలిచిన సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు కూడా తెగ ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గ్రామాభివృద్ధికి రావాల్సిన నిధులు రావడం లేదన్నారు. సొంత డబ్బులతో చేసే పనులకు బిల్లులు ఇవ్వడం లేదన్నారు. దీంతో వైసీపీ ప్రజాప్రతినిధులు గ్రామాల్లో తలెత్తుకునే పరిస్థితి కూడా లేదని చెప్పుకొచ్చారు. గ్రామ స్వరాజ్యం పోయి జగన్ రాజ్యం వచ్చిందంటూ విమర్శించారు. ఇష్టారీతిన దోపిడీ.. అడిగితే దాడులు అన్నట్లు గ్రామాల్లో రౌడీరాజ్యం నడుస్తోందని ఆరోపణలు చేశారు. గ్రామాల్లో ఎలాంటి మౌలిక వసతులూ లేవని.. ఉపాధి లేదని అన్నారు.