హైదరాబాద్ భవిష్యత్తు అవసరాల కోసం నగరంలో మెట్రో మార్గాన్ని మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని ఇటీవల మంత్రి కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా మెట్రో విస్తరణ అంశాలపై మెట్రో రైల్ భవన్‌లో గురువారం (ఆగస్టు 10) కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ మెట్రో రైలు మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంపై ప్రత్యేకంగా చర్చించారు.
హైదరాబాద్ భవిష్యత్తు కోసం వివిధ ప్రాంతాలకు మెట్రోని పొడిగించడం, నిర్మించడం అవసరం అని మంత్రి కేటీఆర్ అన్నారు. నగరంలో ఇప్పటికే రద్దీ విపరీతంగా ఉంటోందని, దీన్ని భవిష్యత్తులో తగ్గించాలన్నా, కాలుష్యం తగ్గాలన్నా మెట్రోను వివిధ ప్రాంతాలకు విస్తరింపజేయడం కచ్చితంగా చేయాలని అన్నారు. విశ్వనగరంగా మారాలంటే ప్రజా రవాణా బలోపేతం కావాలని అన్నారు. మెట్రో విస్తరణకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు వేగంగా కార్యక్రమాలు చేయాలని అన్నారు. 48 ఎకరాల భూమిని మెట్రో డిపో కోసం అప్పగించాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఇప్పటికే నడుస్తున్న మెట్రో రైళ్లకు అదనంగా మరిన్ని కోచ్‌లను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
మెట్రో స్టేషన్ ల నుంచి వివిధ కాలనీలకు, ఏరియాలకు నడిచే ఫీడర్ సేవలను మెరుగుపరచాలని, ప్రయాణికులు నడిచేందుకు వీలుగా ఫుట్‌పాత్‌లను కూడా అభివృద్ధి చేయాలని అన్నారు. అవసరం అయిన చోట్ల మల్టీ లెవల్ కార్ పార్కింగ్ కాంప్లెక్స్‌లు నిర్మాణం చేయాలని సూచించారు. ఇప్పటికే ఉన్న స్టేషన్లతో పాటుగా, ప్రతిపాదిత మెట్రో స్టేషన్‌లకు సమీపంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు.
మెట్రో రైలు భవన్‌లో జరిగిన సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదితర పలువురు అధికారులు పాల్గొన్నారు.