Azharuddin: టీమిండియా మాజీ కెప్టెన్, హెచ్ఐసీసీ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకీ సిద్ధం అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్న అజారుద్దీన్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. అజారుద్దీన్ 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటు సభ్యునిగా ఉత్తరప్రదేశ్ లోని మురాదాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతగా అసెంబ్లీకి ఎన్నికై సభలో అడుగుపెట్టాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ నియోజవర్గంలో యాక్టివ్ గా మారారు. అజారుద్దీన్ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల్లో కొన్ని రోజుల నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.


జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తనకు తానే అభ్యర్థినంటూ ప్రకటించుకున్నారు. అక్కడ సామాజిక సమీకరణాలు తనకు కలిసి వస్తాయని భావిస్తున్నారు అజారుద్దీన్. ఈ క్రమంలో బుధవారం నియోజకవర్గంలో అజారుద్దీన్ వర్గం సమావేశం నిర్వహించగా.. పీజేఆర్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డికి చెందిన వర్గం వారు అక్కడికి రావడంతో పరిస్థితి ఘర్షణకు దారితీసింది. అజారుద్దీన్ రెహమత్ నగర్ లో సమావేశం నిర్వహించగా.. ఆ  సమయంలోనే విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు సమావేశాన్ని అడ్డుకున్నారు. విష్ణు వర్ధన్ రెడ్డికి చెందిన నియోజకవర్గంలో ఆయనకు సమాచారం ఇవ్వకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారంటూ నిలదీశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 


కాగా, దివంగత పీజేఆర్ (పి. జనార్దన్ రెడ్డి) కుమారుడైన విష్ణు వర్ధన్ రెడ్డి.. పీజేఆర్ మరణం తర్వాత 2007లో తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేశారు. డీలిమిటేషన్ కు ముందు ఖైరతాబాద్ లో మెజారిటీతో గెలుపొందారు. జూబ్లీహిల్స్ లో జరిగిన ఎన్నికల్లో 2,80,236 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే విష్ణు కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. విష్ణు పార్టీ హైకమాండ్ పై కొన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజుల క్రితం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తోనూ విష్ణు సమావేశం అయ్యారు. తాను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంపై వివరణ ఇచ్చినట్లు సమాచారం. 


Also Read: Chandrayaan-3: చంద్రుడు, భూమి ఫోటోలు తీసిన చంద్రయాన్-3, ట్విట్టర్‌లో షేర్ చేసిన ఇస్రో


వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ జూబ్లీహిల్స్ నియోజవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు విష్ణు వర్ధన్ రెడ్డి. ఈ సమయంలో అజారుద్దీన్ ఎంట్రీ ఇవ్వడం, నియోజవర్గంలో సమావేశం నిర్వహించడంతో రాజకీయ కాక పెంచినట్లయింది. తాజాగా అజారుద్దీన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని సోమాజిగూడ, ఎర్రగడ్డ, బోరుబండ ప్రాంతాల్లో పర్యటించారు. పార్టీ కేడర్ తో కలిసి ఛాయ్ పే చర్చ నిర్వహించారు. స్థానికులతోనూ మాట్లాడారు. అయితే అజారుద్దీన్ వ్యవహార శైలిని విష్ణు వర్ధన్ రెడ్డి వర్గీయులు సహించడం లేదు. పీజేఆర్ 30 సంవత్సరాలు పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశారని, విష్ణు కూడా 16 ఏళ్ల నుంచి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున పని చేస్తున్నారని ఆయన వర్గీయులు అంటున్నారు. విష్ణుకు కాకుండా వేరే వారికి టికెట్ ఇస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ఈ క్రమంలో పార్టీ అధిష్ఠానం నిర్ణయం కీలకం కానుంది.