అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్న వేళ ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయాలు చకచకా తీసుకుంటోంది. ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. తొలి విడత డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ చేసిన ప్రభుత్వం రెండో విడతకు రెడీ అయింది. హైదరాబాద్లో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి ముహుర్తం ఫిక్సయింది. ఈ నెల 21న అర్హులైన పేదలకు 13,300 ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. రెండో దశలో దాదాపు 13,300 ఇళ్లను పేదలకు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీపై మంత్రులు, అధికారులతో సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు కేటీఆర్. అత్యంత పారదర్శకంగా అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూంలు అందిస్తున్నామని ఇళ్ల ఎంపిక ప్రక్రియలో ఎవరి ప్రమేయం ఉండదని స్పష్టం చేశారు.
తొలివిడతలో కొల్లూరులో 3, 500 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ చేసింది ప్రభుత్వం. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగితే పూర్తిస్థాయి బాధ్యత అధికారులదేనని హెచ్చరించారు. తప్పు చేసిన అధికారులపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంటుందని హెచ్చరించారు. లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉండదన్నారు మంత్రి కేటీఆర్. అర్హుల ఎంపిక పూర్తిస్థాయి బాధ్యతను ప్రభుత్వం అధికారులకే అప్పగించినట్లు వెల్లడించారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులందరి వివరాలతో కంప్యూటర్ ఆధారిత డ్రా తీస్తున్నామని స్పష్టం చేశారు.
మూసీ పరివాహక ప్రాంతంలోని కబ్జాలను తొలగించి, వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తామన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్లో నిర్మిస్తున్న లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ప్రభుత్వానికి 9వేల 100 కోట్ల ఖర్చయిందని.. వాటి మార్కెట్ విలువ 50 వేల కోట్లుగా ఉందన్నారు. గృహలక్ష్మి పథకాన్ని త్వరలో ప్రారంభిస్తామన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లో నోటరీ ప్రాపర్టీల అంశంలోనూ త్వరలో పూర్తి మార్గదర్శకాలు వస్తాయన్నారు మంత్రి కేటీఆర్. 58, 59 జీవోల ద్వారా పెద్ద ఎత్తున ప్రజలకు ఉపశమనం లభించిందని గుర్తు చేశారు.