హైదరాబాద్ లో వీధి కుక్కల దాడులు కామన్ అయిపోయాయి. నిత్యం ఏదో ఒక చోట కుక్కలు చిన్నారులపై దాడులు చేస్తూనే ఉన్నాయ్. అంబర్ పేట్ చిన్నారి ఘటన ఇంకా కళ్ల ముందు కదులుతూనే ఉంది. తాజాగా టప్పాచబుత్రలో చిన్నారిపై కుక్క దాడి చేసింది. తల్లితో కలిసి రోడ్డుపై వెళ్తుండగా కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. కొడుకును కాపాడుకునేందుకు వెళ్లిన తల్లిని కూడా కరిచేందుకు ప్రయత్నించింది. పక్కనే మరో వ్యక్తి రావడంతో కుక్క అక్కడ్నుంచి పరుగులు పెట్టింది. కుక్క దాడి దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. రెండురోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 


తల్లి ముందు వెళ్తుండగా వెనుక నుంచి వెళ్తున్న దాడి చేసింది. బాలుడి చెవి కొరికేసింది. బాలుడు అరవడంతో అప్రమత్తమైన తల్లి కుమారుడ్ని విడిపించుకుంది. ఈ క్రమంలో కుక్క ఆమెను కరిచేందుకు ప్రయత్నించింది. అక్కడే మరో వ్యక్తి రావడంతో అక్కడి పారిపోయింది కుక్క. గాయపడ్డ బాలుడ్ని చిన్నారి తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స ఇప్పించారు. చిన్నారి ట్రీట్మెంట్ ఇప్పించేందుకు మూడు లక్షలకు పైగా ఖర్చు చేశారు. ఈ కేసును  హైకోర్టు సుమోటోగా తీసుకొని జీహెచ్‌ఎంసీకి, ప్రభుత్వ అధికారులకు నోటీసులు సైతం జారీ చేసింది. 






కొన్ని నెలల క్రితం అంబర్ పేట్ లో హృదయ విదారకమైన ఘటన చోటు చేసుకుంది. ఓ నాలుగేళ్ల చిన్నారిని వీధి కుక్కలు వెంటపడి చంపేశాయ్. సెలవు రోజు కావడంతో తండ్రితో కలిసి కొత్త ప్రాంతానికి వచ్చిన ఆ చిన్నారి..  వీధికుక్కలు వెంట పడడంతో భయంతో పరుగులు పెట్టాడు. చివరికి  కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డ చిన్నారిని ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండాపోయింది. తీవ్ర రక్తస్రావం కారణంగా బాలుడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 


 కంచన్ బాగ్ డీఆర్డీఓ టౌన్‌షిప్‌లో మూడేళ్ల బాలుడిపై  ఐదు కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. వెంటనే గమనించిన స్థానికులు బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చిన్నారికి ప్రాణాపాయం తప్పింది. బాలుడు ట్యూషన్ నుంచి ఇంటికి విస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఏడాది జూన్ లో కూకట్ పల్లిల్లో ఓ బాలిడిపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. ఇంటి వద్ద ఆడుకుంటున్న మయాంక్ అనే కుర్రాడిపై వీధి కుక్కలు అటాక్ చేశాయి. బాలుడి అరుపులు విన్న చుట్టపక్కల వారు కుక్కలను వెళ్లగొట్టాయి. అయితే అప్పటికే కుక్కలు మయాంక్ ను తీవ్రంగా గాయపరిచాయి. మయాంక్ చెంప, దవడకు తీవ్ర గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. 


కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటన సుమోటో పిటిషన్​గా స్వీకరించిన హైకోర్టు విచారణ చేపట్టింది. సీఎస్, జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మరోవైపు వీధి కుక్కల బెడద, కుక్క కాటు నివారణ కోసం పురపాలకశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. అయినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. అధికారుల అలసత్వంతో చిన్నారులు ఆస్పత్రుల పాలవుతున్నారు.