చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన తనయుడు నారా లోకేశ్ చేసిన ట్వీట్ బాధ క‌లిగించింద‌ని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. అదే నిజమైతే చాలా దురదృష్టకరమని అన్నారు. కుమారుడిగా తండ్రి ఆరోగ్యంపై ఆందోళ‌న ఎలా ఉంటుందో తనకు తెలుసని అన్నారు. కేసీఆర్ నిరాహార దీక్ష చేసిన స‌మ‌యంలో తనకు కూడా అలాంటి ఆందోళ‌నే కలిగిందని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ నిరాహార దీక్ష చేసిన సమయంలో ఆయన మరో రోజు దీక్ష చేస్తే చనిపోతారని అప్పుడు డాక్టర్లు చెప్పారని  గుర్తు చేశారు. ఇదంతా ఏపీలో టీడీపీ, వైఎస్ఆర్ సీపీ వ్యవహారం అని అన్నారు.


హైద‌రాబాద్ ప్రశాంతంగా ఉండాల‌నే ఇక్కడ ఆందోళ‌న‌లు వ‌ద్దంటున్నామని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలనే తన తపన అని కేటీఆర్ అన్నారు.


నారా లోకేశ్ ట్వీట్


చంద్రబాబుకు ప్రమాదం పొంచి ఉందని ట్వీట్ చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఆయన విషయంలో ప్రభుత్వం ఏదో దాస్తోందని ఆరోపించారు. జైలులో అపరిశుభ్రమైన వాతావరణంలో చంద్రబాబును ఉంచారని దీని వల్ల ఆయన తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారని లోకేశ్ అభిప్రాయపడ్డారు. దీని వల్ల ఆయనకు ఆరోగ్య సమస్యలతోపాటు ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అన్నారు. ఆయనకు స్టెరాయిడ్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఏదో దాచి పెడుతోందని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఏదైనా హాని జరిగితే దానికి పూర్తి బాధ్యత జగన్ మోహన్ రెడ్డే తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.