Kaithalapur Flyover: హైదరాబాద్‌లో కైతలాపూర్ - మాదాపూర్ అయ్యప్ప సొసైటీ మధ్య కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్‌ను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం (జూన్ 21) ప్రారంభించారు. కూకట్ పల్లి నియోజకవర్గం పరిధిలో ఈ ఫ్లైఓవర్ ఉంది. రూ.86 కోట్లు ఖర్చు పెట్టి జీహెచ్ఎంసీ దీన్ని నిర్మించింది. ఈ ఫ్లైఓవర్ రాకతో కూకట్‌పల్లి, హైటెక్ సిటీల మధ్య, జేఎన్టీయూ హైటెక్ సిటీల మధ్య ట్రాఫిక్ కష్టాలు తప్పనున్నాయి. అంటే, ఈ ఫ్లైఓవర్ వల్ల జేఎన్టీయూ - హైటెక్ సిటీ మార్గంలో ట్రాఫిక్ తగ్గనుంది. ఆ మార్గంలో ఉన్న జేఎన్టీయూ, మలేసియన్ టౌన్ షిప్ జంక్షన్, సైబర్ టవర్స్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ బాగా తగ్గనుంది. అంతేకాకుండా హైటెక్ సిటీ నుంచి సికింద్రాబాద్‌కు దూరం మూడు కిలో మీటర్లకుపైగా తగ్గనుంది.


ఈ ఫ్లైఓవర్ ను మంగళవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన వేదికపై మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కేటీఆర్ సవాలు విసిరారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ ప్రాంతంతో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, కిషన్ రెడ్డికి దమ్ముంటే ఆ ప్రాంతంలో ఫ్లై ఓవర్‌లు కట్టించాలని కేటీఆర్ సవాల్ విసిరారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా మొదటి ఫేస్ వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం - ఎస్ఆర్‌డీపీ (SRDP) కింద రూ.8,052 కోట్లతో నగరంలో 47 ప్రాజెక్టులు చేపట్టామని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. వాటిలో ఇప్పటి వరకూ 30 అందుబాటులోకి వచ్చాయని అన్నారు. 3,117 కోట్లతో రెండో దశ ఎస్ఆర్‌డీపీ మొదలు పెడతామని అన్నారు.


ఫ్లైఓవర్ మొత్తం ఖర్చు - రూ.86 కోట్లు
పొడవు - 675.5 మీటర్లు
వెడల్పు - నాలుగు లేన్లు