కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదిలాబాద్ పర్యటన సందర్భంగా బహిరంగ సభలో చేసిన విమర్శలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణకు వచ్చి ప్రధాని మోదీ, అమిత్‌ షా ఎన్ని అబద్ధాలు చెప్పినా.. బీజేపీకి ఇక్కడ ఓటమి తప్పదని అన్నారు. అబద్దాల అమిత్‌షా పార్టీకి రాష్ట్రంలో గుణపాఠం తప్పదని అన్నారు. అమిత్‌ షా ప్రసంగం అంతా అబద్దాలే అని.. తెలంగాణ ఎన్నికల్లో మళ్లీ బీజేపీకి అన్ని స్థానాల్లో డిపాజిట్‌ గల్లంతు ఖాయమని అన్నారు. పరివార్‌ వాద్‌ అంటూ అమిత్‌ షా మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారని కేటీఆర్‌ అన్నారు. 


ఏ క్రికెట్‌ కప్‌ సాధించారని అమిత్ షా కుమారుడు జై షా క్రికెట్ బోర్డు పదవిలో ఉన్నారని నిలదీశారు. అసలు అమిత్‌ షా కుమారుడు ఎప్పుడు క్రికెట్ ఆడారో చెప్పాలని డిమాండ్ చేశారు. గత పది సంవత్సరాల్లో తెలంగాణకు బీజేపీ ఒక్క విద్యా సంస్థను కూడా ఇవ్వలేదని అన్నారు. తెలంగాణలో బీజేపీ చేస్తున్న మత రాజకీయాలు చెల్లబోవని అన్నారు. రైతుల ఆత్మల్లో తెలంగాణ అగ్రస్థానమని అమిత్‌ షా చెప్పిన మాటలు అవాస్తవమని అన్నారు. రైతు సంక్షేమం దేశంలో తెలంగాణ తొలి స్థానంలో ఉందని అన్నారు. సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాను పునరుద్ధరిస్తామని.. గత ఐదేళ్ల కిందట ఆదిలాబాద్‌ సభలో అమిత్‌ షా ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.


మా స్టీరింగ్ మా చేతుల్లోనే
‘‘పరివార్‌ వాద్‌ అని కేంద్ర మంత్రి అమిత్‌ షా మాట్లాడితే ప్రజలు పరిహాసం చేస్తున్నారు. అమిత్‌ షా కుమారుడు క్రికెట్‌ ఎప్పుడు ఆడారో స్పష్టం చేయాలి. ఆయనకి బీసీసీఐలో ఎలా స్థానం కల్పిస్తారు. కేంద్రం తెలంగాణకు ఒక్క విద్యా సంస్థ కూడా ఇవ్వలేదు. అమిత్ షా అన్నట్లుగా మజ్లిస్ చేతిలో మా స్టీరింగ్‌ లేదు. మా స్టీరింగ్ మా చేతుల్లోనే ఉంది. కానీ, బీజేపీ స్టీరింగ్‌ అదానీ చేతుల్లో ఉంది. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ అగ్రస్థానమన్న అమిత్‌ షా వ్యాఖ్యలు అసత్యం. రైతు సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఆదిలాబాద్‌ సీసీఐ ప్రారంభానికి ఐదేళ్ల క్రితం అమిత్‌ షా ఇచ్చిన హామీకి ఎలాంటి కదలికా లేదు’’ అని కేటీఆర్‌ విమర్శలు చేశారు.


ఇచ్చిన మాట నిలబెట్టుకునే సత్తా లేని ప్రభుత్వం బీజేపీ అని.. బీజేపీ కేంద్రంలో ఉండడం తెలంగాణ ప్రజల దురదృష్టమని అన్నారు. యూనివర్సిటీకి భూమి కేటాయించలేదనేది పూర్తిగా అబద్ధమని అన్నారు. తెలంగాణకు కేంద్రం ఒక్క మెడికల్‌ కాలేజీ, నవోదయ విద్యాలయం, కేజీబీవీ కూడా ఇవ్వలేదని విమర్శించారు. అదానీ గురించి మాట్లాడమంటే ప్రధాని ఎందుకు నోరు ఎత్తరని అన్నారు.