వచ్చే 50 ఏళ్లలో ప్రపంచంలోనే భారత్ కీలక పాత్ర పోషించబోతోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం ప్రగతిపథంలో దూసుకుపోతోందని చెప్పారు. ఈ మేరకు సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో మేధావులతో నిర్వహించిన సమావేశంలో అమిత్ షా మాట్లాడారు. అనేక రంగాల్లో మన దేశం అగ్రస్థానానికి చేరబోతోందని.. బీజేపీ సిద్ధాంతాల ఆధారంగా నడిచే పార్టీ అని అన్నారు. బీఆర్ఎస్‌కు ఏం విధానం ఉందని ప్రశ్నించారు. అది కుటుంబ పార్టీ అని, ఇలాంటి పార్టీలు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండవని అన్నారు. కుమారుడు కేటీఆర్‌ను సీఎం చేయడం తప్ప కేసీఆర్‌కు విధానం ఏముందని ప్రశ్నించారు? బీఆర్ఎస్ ప్రభుత్వ స్టీరింగ్ మజ్లిస్ పార్టీ చేతుల్లో ఉందని విమర్శించారు. బీజేపీ హయాంలో 12 కోట్ల మందికి ఇళ్లు ఇచ్చామని.. మోదీ ప్రభుత్వం 9 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిందని చెప్పారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నామని గుర్తు చేశారు.
మధ్యాహ్నం ఆదిలాబాద్ సభలో మాట్లాడుతూ.. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ పార్టీ వాళ్లు కొత్త బట్టలు వేసుకొని వస్తారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ పేదల గురించి మాట్లాడుతుంది కానీ.. పేదల కోసం ఏమీ చేయబోదని విమర్శించారు. దళితులు, గిరిజనులను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని, కేసీఆర్ మాత్రం పదేళ్లుగా తన ఫ్యామిలీ కోసమే పని చేస్తూ వస్తున్నారని విమర్శించారు. కేటీఆర్‌ను సీఎం చేయడం కోసమే నిరంతరం పని చేస్తూ ఉంటారని అన్నారు.
డిసెంబరు 3న హైదరాబాద్‌లో బీజేపీ జెండా ఎగురుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వమే అధికారం చేపడుతుందని అన్నారు. సీఎం కేసీఆర్ గిరిజనుల కోసం ఎన్నో హామీలు ఇచ్చారని.. కానీ వాటిని ఇప్పటికీ అమలు చేయలేదని అన్నారు. ఆదివాసీలకు సీఎం రెండు పడకల ఇళ్లు ఇస్తామని అన్నారు.. కానీ ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ చేశామని కేసీఆర్ పదేపదే చెబుతుంటాని.. కేవలం రైతుల ఆత్మహత్యల విషయంలోనే తెలంగాణను నంబర్ వన్ చేశారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఎన్నికల గుర్తు కారు.. కానీ ఆ కారు స్టీరింగ్ మాత్రం ఒవైసీ దగ్గర ఉంటుందని అమిత్ షా ఎద్దేవా చేశారు.