KTR Road Show in Cantonment: కంటోన్మెంట్ అభివృద్ధి బాటలో మరింత ముందుకు సాగాలంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్య నందితను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కేటీఆర్ కోరారు. కంటోన్మెంట్ పరిధిలోని భూములకు బదులు ఇతర చోట భూములిస్తామంటే కేంద్రంలోని బీజేపీ సర్కారు ఒప్పుకోవడం లేదని మండిపడ్డారు. కంటోన్మెంట్ ప్రజల బాగోగులను పట్టించుకోని బీజేపీని డిపాజిట్లు దక్కకుండా ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్నానగర్, ఆ తర్వాత పికెట్ లో మంత్రి కేటీఆర్ రోడ్ షోలో పాల్గొన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందిత కలిసి క్యాంపెయిన్ చేశారు. ఈ సందర్భంగా జనం వేలాదిగా తరలివచ్చారు. అన్నానగర్, పికెట్ గులాబీ జెండాలతో కిక్కిరిసిపోయాయి.


కేంద్రం మెడలు వంచి, బీ2 భూములకు పట్టాలిప్పించే సత్తా కేసీఆర్ కే ఉందన్నారు మంత్రి కేటీఆర్. కేంద్రం సహకరించకున్నా కంటోన్మెంట్ ప్రజలకు మాత్రం ఉచితంగా మంచి నీళ్లు ఇస్తున్నామని గుర్తు చేశారు. అన్ని సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని అన్నారు. మోదీ అన్ని ధరలు పెంచి, పిరమైన ప్రధానిగా మారారని దుయ్యబట్టారు. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ తో తెలంగాణకు ఒరిగేదేమీ లేదని ఎద్దేవా చేశారు. 


బీజేపీని బొందపెట్టాలి
దివంగత ఎమ్మెల్యే సాయన్న వివాదరహితమైన నాయకుడని.. అలాంటి నాయకుడి కుమార్తె లాస్యనందితపై బీజేపీ నేతలు బురద జల్లుతున్నారని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దిక్కుమాలిన వీడియోలతో దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ప్రజల ముందుకు వస్తున్న ఆడబిడ్డపై... లేనిపోని అభాండాలు వేస్తున్న బీజేపీని బొందపెట్టాలని పిలుపునిచ్చారు. 


కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందిత గెలిస్తే అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. మేనిఫెస్టోలో ప్రకటించిన కొత్త పథకాలు అమలవుతాయని అన్నారు. సాయన్నలాగే లాస్యనందితను కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కేటీఆర్ కోరారు. 


అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందిత మాట్లాడుతూ.. నవంబర్ 30న కారు గుర్తుకే ఓటేసి, తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ తోనే కంటోన్మెంట్ లోని నిరుపేద ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. 


ఈ రోడ్ షోలో సీనియర్ నాయకులు ఎంఎన్ శ్రీనివాస్, బెవరేజెస్ కార్పొరేషన్ ఛైర్మన్ గజ్జెల నాగేశ్, కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు జక్కుల మహేశ్వర్ రెడ్డి, అనితా ప్రభాకర్, నళిని కిరణ్, పాండు యాదవ్, భాగ్యశ్రీ శ్యాంకుమార్, లోకనాథం, మాజీ కార్పొరేటర్ ఆకుల రూప హరి, తో పాటు సీనియర్ నేతలు టీఎన్ శ్రీనివాస్, నర్సింహ ముదిరాజ్, దేవేందర్ తో పాటు పలువార్డుల అధ్యక్షులు,  పార్టీ అనుంబంధ సంఘాల సభ్యులు, ఉద్యమకారులు, మహిళా నాయకులు, యువ నాయకులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు  తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.