హైదరాబాద్‌లో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించాడు. ఆపదలో చావుబతుకుల్లో ఉన్న తల్లీ కూతుళ్లకు కాపాడి రియల్ హీరో అయ్యాడు. ఈ విషయం మంత్రి కేటీఆర్‌కు తెలియడంతో ఆయన కానిస్టేబుల్‌ను ప్రత్యేకంగా అభినందించారు. విధి నిర్వహణలో ప్రాణాలను ఫణంగా పెట్టి పౌరులను కాపాడిన కానిస్టేబుల్‌ పనితనం అభినందనీయం అని కేటీఆర్ కొనియాడారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. అసలేం జరిగిందంటే.. 


తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా దట్టమైన మంటల్లో చిక్కుకుని ఆర్తనాదాలు చేస్తున్న తల్లీ కూతుళ్లను కానిస్టేబుల్ కాపాడాడు. దీంతో ఆయన రియల్ హీరో అనిపించుకున్నారు. శ్రావణ్ కుమార్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలా ప్రాణాలకు తెగించి తల్లీకూతుళ్లకు ప్రాణం పోసిన శ్రావణ్‌ సాహసాన్ని తోటి ఉద్యోగులు అందరూ మెచ్చుకుంటున్నారు. 


పంజాగుట్టలో ఉన్న జూబ్లీ మెడికల్‌ షాపుపైన నాలుగు అంతస్తులో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే మంటలు పెద్దగా వ్యాపించిపోయాయి. ఆ మంటల్లో తల్లీకూతుళ్లు అగ్ని కీలల్లో చిక్కుకుపోయారు. అక్కడే ఉన్న చాలా మందికి వారిని కాపాడాలని ప్రయత్నించినా.. మంటల ధాటికి ఎవరూ సాహసం చేయలేకపోయారు. అదే సమయంలో సమాచారం అందుకున్న పంజాగుట్ట ట్రాఫిక్‌ కానిస్టేబుల్ శ్రావణ్ కుమార్ అక్కడి చేరుకున్నాడు. అప్పటికే భవనంలో చాలా వరకూ మంటలు వ్యాపించడంతోపాటు దట్టంగా పొగలు కూడా అలుముకున్నాయి. 
స్థానికులు వద్దని వారిస్తున్నా మంటలు సైతం లెక్కచేయకుండా డ్రైనేజీ పైప్‌ ద్వారా అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్తులోకి చేరుకున్నారు. అగ్ని కీలల్లో చిక్కుకుని విలవిలలాడుతున్న తల్లీ కూతుళ్లను రక్షించాడు. అందరూ ఆందోళనతో చూస్తుండగా.. ఇద్దరినీ కాపాడి సురక్షితంగా కానిస్టేబుల్​శ్రావణ్ కుమార్ వారిని కిందకు తీసుకొచ్చారు. అయితే, ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అదే సమయంలో తన కర్తవ్యంతో తల్లీకూతుళ్లను కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రవణ్‌ కుమార్‌ను స్థానికులు అభినందించారు. 


ఈ విషయం తోటి ఉద్యోగులు, పోలీసు ఉన్నతాధికారులు, మీడియా ద్వారా మంత్రి కేటీఆర్‌కు తెలియడంతో ఆయన అభినందిస్తూ ట్వీట్ చేశారు. అంతేకాక, శ్రావణ్ కుమార్‌కు రివార్డు ఇవ్వాలని హోం మంత్రి మహమూద్ అలీకి సూచిస్తూ ట్యాగ్ చేశారు. ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ రియల్‌ హీరోపై ప్రశంసలు కురిపిస్తున్నారు.