ఇన్నేళ్ల తన సినీ ప్రయాణం సాఫీగా సాగలేదని ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని నటుడు మోహన్ బాబు అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన సినిమా సన్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సన్ ఆఫ్ ఇండియా సినిమా విశేషాలపై మోహన్‌బాబు మీడియాతో పంచుకున్నారు. రాయలసీమలోని ఓ పల్లెటూరులో పుట్టానన్నారు. ఆకలి నుంచే తనకు కోపం వచ్చిందని, ఆ కోపానికే బానిసయ్యానని, దాని వల్ల నష్టపోయానన్నారు. ఇప్పుడు తన జీవితకథతో పుస్తకం రాస్తున్నానన్నారు. అప్పటి రాజకీయాలు, ఇప్పటి రాజకీయాలు చాలా తేడా ఉందన్నారు. ఇప్పుడు రాజకీయం చాలా మారిపోయిందని మోహన్ బాబు అన్నారు. ఒకప్పుడు రాజకీయాల్లో ఉంటే గొప్పగా చూసేవారని, ఇప్పుడు రాజకీయాల్లో ఉంటే చులకనగా చూస్తున్నారన్నారు.
టికెట్ల వ్యవహారంపై మాట్లాడలేదు
మంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు ఇలా ఎంతోమంది తన ఇంటికి అతిథులుగా వస్తుంటారని నటుడు మోహన్ బాబు అన్నారు. మంత్రి పేర్నినాని తన ఇంటికి అతిథిగా వస్తే చాలా రకాల వార్తలు వచ్చాయన్న ఆయన... మంత్రి బొత్స కుమారుడి పెళ్లిన వచ్చిన ఆయనను బ్రేక్‌ఫాస్ట్‌కి ఇంటికి ఆహ్వానించానన్నారు. ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంపై మంత్రి పేర్ని నానితో ఏం మాట్లాడలేదన్నారు. ఏదో సరదాగా మాట్లాడుకున్నామన్నారు. మంత్రితో దిగిన ఫొటోను విష్ణు ట్వీట్ చేశాడని మోహన్ బాబు అన్నారు. టికెట్ ధరల విషయం గురించి తాను మాట్లాడదలచుకోలేదన్నారు.
అందుకే ముద్దు సీన్లు
'దర్శకుడు డైమండ్ రత్నబాబు సన్ ఆఫ్ ఇండియా కథ చెప్పారు. కథ నాకు బాగా నచ్చింది. సినిమా చేసేందుకు ఓకే చెప్పా. మూడేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గురువు గారు దాసరి నారాయణరావు నటుడిగా ఎన్నో ప్రయోగాలు చేశారు. ఆయనలా ప్రయత్నించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా చేశాను. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మంచి చిత్రమని తప్పకుండా భావిస్తారు. ఈ సినిమాలో ముద్దు సీన్లు ఉంటాయి. దీనిపై విష్ణు అభ్యంతరం వ్యక్తం చేశాడు. మనకు సొసైటీలో మంచి పేరు ఉంది. విద్యాసంస్థలు నడుపుతున్నాం. ఈ సీన్లు పెడితే బాగోదేమో అని తన అభిప్రాయం చెప్పాడు. కథలో భాగంగా ముద్దు సీన్లు ఓకే చేశాం. ప్రేక్షకులు అది తప్పకుండా అర్థం చేసుకుంటారు'
రెండు స్క్రిప్ట్ లు సిద్ధం
దర్శకత్వం చేయాలని రెండు స్క్రిప్ట్‌లు సిద్ధం చేశానని మోహన్ బాబు అన్నారు. తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఎవరో ఒకర్ని కొడతానని భయం ఉందన్నారు. నటీనటులు ఆలస్యంగా వచ్చినా, వెంటనే కారవ్యాన్‌లోకి వెళ్లినా తనకు కోపం వస్తుందన్నారు. తాను రాయలసీమ ప్రాంతానికి చెందిన వాడినని సినిమాల్లోకి వచ్చిన కొత్తలో రాయలసీమ వాడు సినిమాకి పనికిరాడన్నారని ఆయన అన్నారు.
ఎన్టీఆర్ సినిమాలు చూసి డైలాగ్ విని భాష నేర్చుకున్నానని, ఆ తర్వాత దాసరినారాయణరావు దగ్గర శిక్షణ తీసుకున్నానన్నారు.