Minister Harish Rao: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి వై జంక్షన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన అమోర్ ఆసుపత్రిని  తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. దేశంలోనే ఉత్తమ ఆర్తో ఆంకాలజీ సర్జన్లలో ఒకరిగా గుర్తింపు పొందిన డాక్టర్ కిషోర్ బి రెడ్డి నేతృత్వంలో ప్రపంచ స్థాయి మల్టీ సూపర్ స్పెషాలిటీ సేవలను ఆస్పత్రి అందిస్తుందని వెల్లడించారు. 250 పడకల బెడ్ల ఆసుపత్రిలో రాడికల్ లాంజ్ తో కూడిన అత్యాధునిక క్యాథలాప్ తోపాటు సాంకేతిక నిపుణులతో సంపూర్ణ చికిత్సలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండడం అమోర్ ఆసుపత్రి ప్రత్యేకత అని ఆయన వివరించారు. క్యాన్సర్ తో బాధపడుతున్న వారికి కూడా అత్యాధునిక చికిత్సను అందిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.






అంతకుముందే ట్విట్టర్ వేదికగా వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా క్యాన్సర్ కు వ్యతిరేకంగా మనందరం కలిసి పోరాటం చేద్దామని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులతో పాటు దాని బారిన పడి ప్రాణాలతో బయటపడిన వారందరికీ అండగా నిలుద్దామని తెలిపారు. అంతేకాకుండా క్యాన్సర్‌ను సకాలంలో గుర్తించడంలో అవగాహన కీలక పాత్ర పోషిస్తుందని చెప్పుకొచ్చారు. 


వారం రోజుల క్రితం వరంగల్ హెల్త్ సిటీ నిర్మాణ పనుల పరిశీలన


వరంగల్ లో హెల్త్ సిటీ నిర్మాణ పనులను వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు శనివారం పరిశీలించారు. అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ... అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెల్త్ సిటీ నిర్మాణం పరిశీలించామన్నారు. వరంగల్ తో పాటు, ఉత్తర తెలంగాణ ప్రజల కోసం కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్  2000 పడకల ఆసుపత్రికి శ్రీకారం చుట్టామన్నారు. హెల్త్ సిటీ నిర్మాణ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయన్నారు. 2023 చివరి నాటికి భవనం పూర్తి అవుతుందన్నారు. దసరా నాటికే పూర్తి అయ్యేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ బి, ఏజెన్సీ, వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించామని మంత్రి తెలిపారు.  మొత్తం 16.5 లక్షల ఎస్ఎఫ్టీలో  24 అంతస్తుల భవనం నిర్మిస్తున్నట్లు తెలియజేశారు.  


216 ఎకరాల్లో హెల్త్ సిటీ 


"వరంగల్ హెల్త్ సిటీ చారిత్రాత్మక భవనం. రాష్ట్రానికే కాదు దేశంలోనే అత్యుత్తమ వైద్య సేవలు ఇక్కడ అందబోతున్నాం. 216 ఎకరాల్లో ఈహెల్త్ సిటీ రూపుదిద్దుకుంటోంది. అవయవమార్పిడి ఆపరేషన్లు కూడా వరంగల్ లో అందుబాటులోకి రాబోతాయి. హైదరాబాద్ తర్వాత వరంగల్ ను అంతగా అభివృద్ధి చేయాలని సీఎం భావిస్తున్నారు. రాజకీయాల కోసం కొందరు విమర్శలు చేస్తారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా విమర్శలు చేశారు. విమర్శలు చేసినోళ్లే ఇవాళ నోరెళ్లబెడుతున్నాయి. కాంగ్రెస్ హయాంలో నేను రానుబిడ్డో సర్కారు దవాఖనాకు అనే వారు. ఇప్పుడు నేను పోత బిడ్డో సర్కార్ దవాఖనాకు అంటుతున్నారు. ఎంబీబీఎస్ సీట్లలో తెలంగాణ నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది. పీజీ సీట్లలో రెండో స్థానంలో ఉంది. మెడికల్ చదువు కోసం మన పిల్లలు ఇతర దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కృషి చేస్తున్నాం. సమైక్య రాష్ట్రంలో మెడికల్ విద్యలో వెనకబడ్డాం" - మంత్రి హరీశ్ రావు