హైదరాబాద్‌లోని మెట్రోలో టికెటింగ్‌ స్టాఫ్‌ మెరుపు సమ్మెకు దిగారు. ఎల్బీనగర్‌ నుంచి మియాపూర్‌ మార్గంలో ఉన్న మెట్రో సిబ్బంది ఆందోళన బాటపట్టారు. మొత్తం 27 స్టేషన్‌లలోని టికెట్‌ కౌంటర్‌లలో పని చేస్తున్న సిబ్బంది ఈ నిరసనల్లో పాల్గొన్నారు. 


తమ సమస్యల పరిష్కారంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సిబ్బంది ఆరోపించారు. తమ జీతాలు పెంచలేదని వాపోయారు. రిలీవర్‌లు సరైన టైంకు రాకపోవడంతో ఎక్కువ సమయం పని చేయాల్సి వస్తోందని ఆరోపించారు. కనీసం సమయానికి తినడానికి కూడా అవకాశం దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదన్నారు. 


సుమారు గంటపాటు ఈ ఆందోళన కొనసాగింది. చివరకు కాంట్రాంక్ట్ ఏజెన్సీ కియోలిస్‌ అధికారులు స్పందించారు. సిబ్బందితో మాట్లాడి వాళ్ల సమస్యలు పరిష్కారానికి ప్రయత్నిస్తామని చెప్పడంతో ఆందోళనకారులు శాంతించారు. 






ఈ ఆందోళనలపై మెట్రో యాజమాన్యం స్పందించింది. ప్రజలకు అసౌకర్యం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలని హెచ్‌ఆర్‌ను ఆదేశించింది. వారి ఆవేదన ఉద్దేశం సహేతుకమే అయినా... వారు చేసిన పని మాత్రం కరెక్టు కాదన్నారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం  తప్పుడు సమాచారాన్ని, పుకార్లను సృష్టించి వ్యాపిస్తున్నారని హెచ్‌ర్‌ మండిపడింది. వారి వాదనలు తప్పు అని కొట్టిపారేసింది. వారి చర్యలు ప్రజాప్రయోజనాలకు పూర్తి విరుద్ధమైనవని స్పష్టం చేసింది. వారిపై కఠిన చర్యలను తీసుకోవాల్సిందిగా కోరుతున్నట్టు పేర్కొంది. సిబ్బందికి తగిన వసతులు, ప్రయోజనాలను మేనేజ్‌మెంట్‌ అందిస్తుందని వివరించింది. ఇంకా వాళ్లకు ఏం కావాలో తెలుసుకునేందుకు తగిన చర్చలు జరుపనుందని ప్రకటించింది.