Telangana Weather: తెలంగాణలో కరవుదీర వానలు పడుతున్నాయి. జులై మొదటి వరకు అనుకున్న వర్షాలు పడలేదు. కానీ గత వారం పది రోజుల నుంచి మాత్రం వానలు దంచి కొడుతున్నాయి. హైదరాబాద్‌సహా అన్ని జిల్లాల్లాల్లో వర్షాలు ఎడతెరిపిలేకుండా కురుస్తున్నాయి. ఈ దెబ్బకు చాలా ప్రాంతాల్లో రికార్డు స్థాయి వర్షపాతాలు నమోదు అవుతున్నాయి. వాగులు వంకలు పొంగుతున్నాయి. ఈ దెబ్బకు కొన్ని ప్రాంతాల్లో రహదారులు తెగిపోతున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. మరో మూడు రోజులు వానలు తప్పవని వాతావరణ శాఖ చెబుతోంది.
తెలంగాణలో పట్టిన ముసురు రికార్డు స్థాయి వానలకు కారణమవుతోంది. హైదరాబాద్‌లో అయితే పొద్దస్తమానం ఆకాశానికి చిల్లులు పడినట్టు వాన పడుతూనే ఉంది. ఇవాళ కాస్త పరిస్థితి అలానే ఉంది. రాత్రి నుంచి జల్లులు పడుతూనే ఉన్నాయి. మధ్య మధ్యలో కాస్త గ్యాప్ ఇస్తూ వానలు కమ్మేస్తున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అధికారులు అప్రమత్తమయ్యారు. చెరవు గట్లు, కాలువల కట్టలు పరిశీస్తున్నారు. బలహీనంగా ఉన్న చోట చర్యలు తీసుకుంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తీసుకెళ్తున్నారు.
తెలంగాణవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న జలపాతాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పర్యాటకులు ఆ ప్రాంతాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రమాదకరంగా మారిన బొగత జలపాతం వంటి ప్రాంతాల్లో పర్యాటకుల రాకను అధికారులు నిషేధించారు. పరిస్థితులు ప్రమాదకరంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఖండాల సమీపంలోని మొలాల్ గుట్ట జలపాతంలో యువకుడు గల్లంతుజలపాతాల వద్ద కొందరి అత్యుత్సాహం ప్రాణాల మీదికి తీసుకొస్తోంది. ఆదిలాబాద్ రూరల్ మండలం ఖండాల సమీపంలో గల మోలాల్ గుట్ట జలపాతంలో ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని భూక్తాపూర్ కాలనీకి చెందిన మనోహర్ సింగ్ (15) తన మిత్రులతో కలిసి బుధవారం ఖండాల ఘాట్ అందాలను తిలకిస్తూ మోలాల్ గుట్ట జలపాతం వద్దకు వెళ్లారు. అక్కడ జలపాతం వద్ద స్నానాలు చేస్తూ సెల్ఫీలు దిగారు. అంతలోనే కాసేపట్లో ప్రమాదవశాత్తు జలపాతంలో మనోహర్ సింగ్ గల్లంతయ్యాడు. ఇద్దరు మిత్రులు భయపడి ఎంతగా వెతికిన కనిపించలేదు. దీంతో భయపడి ఆదిలాబాద్ కు వచ్చేశారు.
మనోహర్ సింగ్ గల్లంతైన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పగా.. పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక పోలీసులు డీడీఆర్ఎఫ్ బృందంతో ఘటనాస్థలానికి వెళ్లి గాలింపు చర్యలు చేపడుతున్నారు. గత 2021 లో లాక్ డౌన్ సమయంలో ఇంద్రవెల్లికి చెందిన ఓ యువకుడు ఇక్కడే కింద ఉన్న లోయలో గల్లంతయ్యాడు. ఇక్కడి ప్రాంతాల్లో ఉన్న జలపాతాలు కొంత లోతుగా ఉన్నాయి. అది తెలియక కొందరు సాహసంగా ఈతకొట్టడానికి ప్రయత్నిస్తుంటారు. స్నానాలు చేస్తుంటారు. ప్రమాదవశాత్తు జలపాతంలో గల్లంతవుతుంటారు. ఈ ప్రమాద స్థలాల వద్ద పలు సూచిక బోర్డులను ఏర్పాటు చేసి లోనికి దిగకుండా స్థానిక అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇంతలా వర్షాలు పడుతున్నా చాలా మంది చేపల వేటు వెళ్తూ ప్రాణాలు తీసుకుంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ముగ్గురు గల్లంత్యారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని లోయర్ మానేర్ డ్యాంలో చేపల వేటకు వెళ్లిన ఓ కుటుంబంలోని ముగ్గురు గల్లంతయ్యారు. మహబూబాబాద్ జిల్లా ఒక వ్యక్తి కొట్టుకుపోయాడు. ఇలాంటి ప్రయత్నాలు చేసి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు.
శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. 54,956 క్యూసెక్కులు కిందికి వదులుతున్నారు. ఇన్‌ఫ్లో 1.20 లక్షల క్యూసెక్కులుగా అధికారులు చెబుతున్నారు. నాగార్జునసాగర్‌కు 1.21 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంటే 5,174 క్యూసెక్కులను కింది వదులుతున్నారు. ఆల్మట్టికి 44,054 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంటే 25,640 క్యూసెక్కులు కిందికి విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌కు 24,842 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉంటే 14,411 క్యూసెక్కులు విడిచిపెడుతున్నారు. జూరాలకు 67 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంటే... 69,122 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. తుంగభద్రకు 29,546 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంటే 38,760 క్యూసెక్కులు కిందికి వదులుతున్నారు. తాలిపేరు ప్రాజెక్టులో 15 గేట్లు ఎత్తి నీరు విడిచిపెడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి 98,440 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా 85 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.