What is The Cost Of EV Charging Service: హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం రోజురోజుకు విపరీతంగా పెరుగుతోంది. పెట్రోల్ వాతల నుంచి తప్పించుకొని సాఫీగా కారు ప్రయాణం సాగిపోవాలని చాలా మంది ఈవీలను కొంటున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈవీ ఛార్జింగ్ ఖర్చులు ఎంత అవుతాయో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈవీలు ఛార్జింగ్ పెట్టాలంటే ప్రభుత్వం కూడా ధరలు నిర్ణయించింది. అంతకంటే ఎక్కువ తీసుకుంటే మీరు ఫిర్యాదు చేయవచ్చు.
ప్రభుత్వ నిర్ణయించిన చార్జింగ్ రేట్లు
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ సబ్సిడీతో నిర్మించిన పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లలో కిలోవాట్ గంటకు 12.06 రూపాయలకు మించి వసూలు చేయడానికి లేదు. ఈ మేరకు వివిధ సమయాల్లో ధరను నియంత్రిస్తారు. అంటే ఛార్జింగ్ ధరలు సమయాన్ని బట్టి మారుతుంటాయి. ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు KWhకు ఏడు రూపాయలు ఛార్జ్ చేస్తారు. మళ్లీ సాయంత్రం ఆరు నుంచి రాత్రి పది వరకు అంతే డబ్బులు వసూలు చేస్తారు. ఈ రెండు టైమింగ్స్‌లో ఒకటే ధర ఉంటుంది. రాత్రి పది నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఐదు రూపాయలు వసూలు చేస్తారు. మిగతా సమయాల్లో ఆరు రూపాయలు ఛార్జ్ చేస్తారు.
ప్రభుత్వం సబ్సిడీ లేకుండా ఏర్పాటు అయిన ఛార్జింగ్ స్టేషన్‌లలో కనీసం kWhకు ఆరు రూపాయలు వసూలు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఛార్జింగ్ స్టేషన్‌లు ఏర్పాటు చేసిన Fortum (ఇప్పుడు GLIDA) హైదరాబాద్‌లో CCS చార్జర్లకు 30/60 kWకు 18.94 రూపాయలు వసూలు చేస్తున్నారు. అదే 200 kW వేగంతో అయ్యే చార్జర్లకు 21 రూపాయలు వసూలు చేస్తారు. హైదరాబాద్‌లో Tata Power EZ Charge టాటా పవన్ 97 చార్జింగ్ స్టేషన్లు నిర్వహిస్తోంది. ఇక్కడ కూడా వివిధ రకాల ధరలు ఉన్నాయి. Ather Grid కూడా హైదరాబాద్‌లో చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసింది. 2020 వరకు ఇక్కడ ఉచితంగా ఛార్జింగ్ చేసే వాళ్లు ఇప్పుడు వాహనాలు పెరగడంతో అక్కడ కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. ElectricPe నెట్‌వర్క్ 10 రూపాయల వరకు వసూలు చేస్తోంది. కొందరు అపార్టమెంట్‌లు, ఇళ్ల వద్దే ఛార్జింగ్ పాయింట్లు పెట్టుకొని అవసరమైన వాళ్లకు అమ్ముతున్నారు. అక్కడ కూడా వివిధ ధరలు అమలులో ఉన్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
| వర్గం | యూనిట్లు | ధర |
| LT-I A | 0-50 | రూ.1.95 |
| LT-I A | 51-100 | రూ.3.10 |
| LT-I B | 101-200 | రూ.4.80 |
| LT-I C | 201-300 | రూ.7.70 |
| LT-I C | 301-400 | రూ.9.00 |
ఇలా ఇంటి వద్దే ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసుకుంటే సగటున kWh ఆరు రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ల కంటే సగం అన్నమాట.
వివిధ వాహన రకాలకు చార్జింగ్ ఖర్చు ఎలా ఉంటుంది?
టూ-వీలర్లుఎలక్ట్రిక్ టూవీలర్లు సాధారణంగా 2-3 kWh బ్యాటరీ కెపాసిటీ కలిగి ఉంటాయి. అలాంటి వాహనాలకు ఒకసారి వంద శాతం ఛార్జ్ చేయడానికి ఇంట్లో అయితే 12 నుంచి 18 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే పబ్లిక్ స్టేషన్లలో ఛార్జ్ చేయిస్తే 24 నుంచి 36 రూపాయలు ఖర్చు అవుతుంది.
త్రీ-వీలర్లు (ఆటోలు)ఎలక్ట్రిక్ ఆటోలకు సాధారణంగా అధిక కెపాసిటీ అవసరం అవుతుంది. కాబట్టి టూవీలర్‌తో పోల్చుకుంటే ఇది కాస్త ఎక్కువగా ఉంటుంది. నేరుగా ఈవీగా వచ్చిన ఆటోలు కంటే ఈ మధ్య కాలంలో నార్మల్ ఆటోలను ఈవీలుగా మారుస్తున్నారు. వీటికి ఖర్చు కాస్త ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్‌లోని RACEnergy వంటి కంపెనీలు బ్యాటరీ స్వాపింగ్ మోడల్‌ను 50వేల రూపాయలకే కన్వర్షన్ కిట్ తో అందిస్తున్నాయి. ఇలాంటి ఆటోలకు కిలోమీటర్‌కు రూపాయిన్నర ఖర్చు అవుతుంది.
ఫోర్ వీలర్లుపాపులర్ ఎలక్ట్రిక్ కార్లు, వాటి బ్యాటరీ కెపాసిటీలు వివిధ రకాలుగా ఉంటాయి. దాని బట్టి వాటి ఛార్జింగ్ ఖర్చు మారుతూ ఉంటుంది.అలాంటి కొన్ని మోడల్స్‌ను ఇక్కడ చూద్దాం.
| కారు మోడల్ | బ్యాటరీ కెపాసిటీ | ఛార్జింగ్ ఖర్చు |
| టాటా నెక్సాన్ | 30.2-40.5 kWh | రూ. 181-243 |
| ఎంజీ జెడ్ ఎస్ | 50.3 kWh | రూ. 302 |
| మహీంద్ర XUV400 | 34.5-39.4 kWh | రూ. 207-236 |
| హ్యూందాయ్ కోనా | 39.2 kWh | రూ. 235 |
హైదరాబాద్‌లో ప్రస్తుతం ఇంటి వద్ద, పబ్లిక్ ప్రదేశాల్లో కలుపుకొని దాదాపు ఐదు వందల వరకు చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. వీటిని మరింత పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. GHMC పరిధిలో 150 DC ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లు స్థాపించే ప్రక్రియలో అధికారులు ఉన్నారు. ఇప్పికే వీటిలో 60కుపైగా పూర్తి అయినట్టు చెబుతున్నారు. హైదరాబాద్‌లోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా 2025 చివరి నాటికి 3,000 ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన. TSREDCO అయితే 10,000 చార్జింగ్ పాయింట్లను పాన్ షాప్లు, కిరాణా దుకాణాల్లో కూడా ఇవ్వాలని భావిస్తోంది. ఇలా ఈవీలు ఏర్పాటు చేయడానికి కేంద్రం కూడా రాయితీలు ఇస్తోంది. ఫేమ్‌స్కీమ్ పేరుతో యువకులను ప్రోత్సహిస్తోంది.