Vizag Pawan Kalyan: ధర్మం దారి తప్పిన ప్రతిసారి దాన్ని పరిరక్షించడానికి ఒక శక్తిపుడుతుంది. హిందువుగా జీవించాలి అంటే జిజియా పన్ను కట్టాలనే కంటక పాలకుడి నుంచి అత్యంత విలువైన కోహినూర్ వజ్రాన్ని సాధించడానికి పోరాడే యోధుడి కథగా హరిహర వీరమల్లు చిత్రం నిలిచిపోతుందని పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖలో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ మాట్లాడారు. చరిత్రలో కీలకమైన విషయాలు భవిష్యత్తు తరాలకు బలంగా చెప్పాలని భావించి ఈ చిత్ర నిర్మాణాన్ని మొదలుపెట్టాం. దాన్ని అత్యంత కఠినమైన పరిస్థితిలో పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు సగర్వంగా తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు.
విశాఖలో నటన నేర్చుకున్నా !
వరుస పజయాలతో ఉన్న సమయంలో ఒక్క విజయం ఇవ్వమని దేవుడి ని ప్రార్థించానని, ఇప్పుడు కూడా తాను నమ్మే సరస్వతి దేవి... హరిహర వీరమల్లు చిత్రాన్ని కచ్చితంగా విజయవంతం చేస్తుందని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. విశాఖపట్నంలో సత్యానంద్ గారి దగ్గరకు వచ్చే వరకు నాకు నటన అంటే ఏంటో తెలియదన్నారు. పది మంది మధ్యా మాట్లాడాలన్నా... స్వేచ్ఛగా భావాలు వ్యక్తపరచాలన్నా ఎంతో ఇబ్బంది పడేవాడినని గుర్తు చేసుకున్నారు. యాక్టింగ్ ప్రారంభించిన తొలినాళ్లలో సత్యానంద్ ను ఎంతో ఇబ్బందిపెట్టేవాడినన్నారు. చెన్నైలో పని జరగడం లేదని విశాఖ తీసుకొచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టారని.. రెండు నెలల్లోనే గంటన్నర స్టేజ్ ప్రదర్శన స్థాయికి తీసుకెళ్లారన్నారు. ఆయన దగ్గర నేను నటన కాదు ధైర్యం నేర్చుకున్నానన్నారు.
నేను పవనం... వాళ్లు బావిలో కప్పలు
పవన్ కళ్యాణ్ ఏ ఊరు వెళ్తే ఆ ఊరు నాదే అని చెబుతాడని విమర్శిస్తుంటారు. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి కావడం వల్ల రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మేము ఉండాల్సి వచ్చింది. అందుకే అన్ని ఊర్ల పేర్లు చెబుతాను. నా పేరు పవనం... తిరుగుతూ ఉంటాను. మనల్ని విమర్శించే వాళ్లు కూపస్థ మండూకాలు.. అంటే బావిలో కప్పలు. బావిలో ఒక గీరి గీసుకొని కూర్చొనే కప్పలకు ఏమీ తెలుస్తుంది పవనం తాలూకా శక్తి? వాటికి ఎంత చెప్పినా అర్థం చేసుకోలేవు.
హోటల్లో నన్ను బంధిస్తే... తెల్లవార్లూ ప్రజలు హోటల్ ముందు నిలబడ్డారు
ఉత్తరాంధ్ర ఆటపాట్లే కాదు... ఇక్కడ జరిగిన ఎన్నో సంఘటనలు నాకు గుండెల్లో గుర్తుండిపోయాయి. రెండేళ్ల క్రితం జనవాణి కార్యక్రమం కోసం విశాఖకు వస్తే ఎన్నో ఆంక్షలు విధించారు. కారు నుంచి బయటకు రాకుండా చేశారు. హోటల్ ఉంటే రాత్రంతా భయబ్రాంతులకు గురి చేశారు. బూటు కాళ్లతో డోర్లను తన్నుతూ రెచ్చిపోయారు. నన్ను బలవంతంగా నిర్బంధిస్తే మొత్తం విశాఖ ప్రజానీకం తరలివచ్చి నోవోటెల్ ముందు కూర్చుంది. అంత బలమైన జ్ఞాపకాలు ఇచ్చింది విశాఖపట్నం. అందుకే ఈ ఫంక్షన్ ఇక్కడ పెట్టాలని నిర్ణయించాననన్నారు. మన సినిమా టికెట్ రూ.10 చేశారు
గత ప్రభుత్వ హయాంలో అందరి హీరోల సినిమాలకు ఒకలా టికెట్ల రేట్లు పెంచిన ప్రభుత్వం... పవన్ కళ్యాణ్ సినిమాకు మాత్రం టికెట్ల రేటును రూ. 10కు తగ్గించేది. అలాంటి పరిస్థితుల్లో కూడా బీమ్లా నాయక్ వంటి సినిమాను అభిమానులు విజయవంతం చేశారు. కూటమి ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ శాఖ జనసేన వద్దే ఉన్నా... టికెట్ల రేట్లు పెంపు విషయంలో చంద్రబాబు నాయుడు అనుమతి తీసుకోవాలని నిర్మాతకు చెప్పానన్నారు.సినిమా పరిశ్రమకు వచ్చి దాదాపు 30 ఏళ్లు అయ్యింది. మూల కథతో పాటు హరిహర వీరమల్లులో బలమైన భాగానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. వ్యక్తిగత కారణాలతో ప్రాజెక్టు నుంచి మధ్యలో పక్కకి వెళ్లిపోయినప్పటికీ ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లాలని బలంగా కోరుకున్న మంచి దర్శకులు ఆయన అని గుర్తు చేసుకున్నారు. ధర్మం జోలికి వస్తే తాటతీస్తామని చూపిస్తాం
ఈ సినిమాలో మాటలు ఉండవు అంతా యాక్షనే అన్నారు. ధర్మం జోలికి వస్తే తాట తీసేస్తాం అని చూపిస్తామన్నారు. మన కృష్ణా నది తీరాన కొల్లూరులో దొరికిన కోహినూర్ వజ్రం గోల్కొండ నవాబ్ చేతికి వెళ్తే, అక్కడి నుంచి మొఘలులకు చేరి, ఇప్పుడు లండన్ మ్యూజియంలో ఉంది. ప్రజా కంటకుడైన పాలకుడు ఔరంగజేబు కూర్చున్న నెమలి సింహాసనంపై ఉన్న కోహినూర్ వజ్రం దొంగిలించి వెనక్కి తీసుకురావాలి అన్న కులీ కుతుబ్ షా ఆదేశంతో హరిహర వీరమల్లు అనే కల్పిత పాత్ర ప్రారంభం అవుతుందన్నారు.
అన్ని ధర్మాలను ఐక్యం చేసేదే సనాతన ధర్మం
సనాతన ధర్మం ఏ మతానికి వ్యతిరేకం కాదు. సనాతన ధర్మం క్రిస్టియానిటీకి వ్యతిరేకం కాదు. ఇస్లాంకి వ్యతిరేకం కాదు. అన్ని ధర్మాలను ఐక్యం చేసేదే సనాతన ధర్మం. ఔరంగజేబు లాంటి వాళ్ళ పాలనలో హిందువుగా జీవించాలంటే జిజియా పన్ను చెల్లించాలి. నేను ఏ పాలకుడికీ వ్యతిరేకం కాదు. తప్పులు జరిగినప్పుడు దాన్ని తెలియజేయాలి. చాళుక్యులు, పాండ్య రాజులు. విజయనగర రాజుల గురించి మనకు పెద్దగా తెలియదు. మన చరిత్ర పుస్తకాలు మొఘలుల గురించి ఘనంగా చెప్పాయి. మిగిలిన రాజుల గురించి తక్కువ చెబుతాయి. తంలో మా అభిమానుల కోసం ఒక మంచి హిట్ ఇవ్వమని గబ్బర్ సింగ్ సమయంలో భగవంతుడిని కోరుకున్నా. నేను నటనలో ఓనమాలు దిద్దుకున్న నేల విశాఖ నుంచి అభిమానులంతా ఆనందించే విజయాన్ని ఇవ్వమని ఆ సరస్వతీ దేవిని కోరుకుంటున్నానని పవన్ అన్నారు.