Megastar Chiranjeevi Reacts On Deep Fake Video : మెగాస్టార్ చిరంజీవి రీసెంట్‌గా డీప్ ఫేక్ వీడియోస్ బారిన పడిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన ఆయన తాజాగా ఈ అంశాలపై రియాక్ట్ అయ్యారు. టెక్నాలజీని మంచి కోసం వాడుకోవాలని సూచించారు. తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలో జరిగిన ఏక్తా దివస్ కార్యక్రమానికి హాజరైన ఆయన పోలీస్ వ్యవస్థపై ప్రశంసలు కురిపించారు.
భయపడాల్సిన అవసరం లేదు
దేశాన్ని ఏకం చేసి మనకు అందించిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ వంటి గొప్ప వ్యక్తుల జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చిన మెగాస్టార్... తెలంగాణలో పోలీస్ వ్యవస్థ చాలా బలంగా ఉందని ప్రశంసించారు. ప్రజలకు పోలీసులు అండగా ఉన్నారని, అందరూ ధైర్యంగా ఉండాలని ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. 'డీప్ ఫేక్ అంశాన్ని ఇప్పటికే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాను. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, సీపీ సజ్జనార్ ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు.
డీప్ ఫేక్, సైబర్ నేరాలకు ఎవరూ భయపడాల్సిన పని లేదు. దీనిపై ఓ చట్టం తీసుకొచ్చేలా ప్రయత్నం చేస్తున్నారు. సెలబ్రిటీలు, పాలిటీషియన్స్‌తో పాటు సామాన్యులకు సైతం డీప్ ఫేక్ వీడియోస్, ఫోటోస్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు. కొత్త చట్టం త్వరగా జరగాలని కోరుకుంటున్నా. పోలీసులు చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. వీటి నుంచి ప్రజలకు రక్షణ కల్పిస్తారు. టెక్నాలజీని మంచికే ఉపయోగించాలి.' అని తెలిపారు.
Also Read : ఓటీటీలో కొత్త లోక Vs కాంతార చాప్టర్ 1 - ఒకే రోజు రెండు బ్లాక్ బస్టర్స్... మీరు ఏ మూవీ చూస్తారు?
అయితే, రెండు రోజుల క్రితం చిరంజీవి డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారంటూ ఆయన సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఓ X అకౌంట్‌ను తన కంప్లైంట్‌కు జత చేశారు. ఇటీవల హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆదేశాలిచ్చినప్పటికీ తనపై ఇలాంటి పోస్టులు పెడుతున్నారని చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా... అనుమతి లేకుండా చిరు ఫోటోలను కానీ, వాయిస్ కానీ ఉపయోగించడానికి వీల్లేదని కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ కామర్స్ సైట్స్, కొన్ని డిజిటల్ మీడియా సంస్థలు తన పేరు వాడుకుంటున్నారంటూ ఆయన కోర్టును ఆశ్రయించగా... చిరంజీవి పేరును దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన పేరును వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించవద్దని వార్నింగ్ ఇచ్చింది.