Montha Cyclone Damage: మొంథా తుపాను (Cyclone Montha) తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. ఆరుగాలం శ్రమించి, పంట ఇంటికి వస్తున్న టైంలో ఈ తుపాను రైతన్నలకు అపార నష్టాన్ని మిగిల్చింది. కోతకు సిద్ధంగా ఉన్న టైంలో నేలపాలైన పైరును చూసిన అన్నదాతలు బోరుమంటున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడవడంతో రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఏకంగా 4,47,864 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టుగా వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ పెను విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొని రైతులు, ప్రజలకు భరోసా ఇచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదటపడుతోంది. ఇళ్లల్లోకి చేరిన బురదను తొలగిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం పర్యటించనున్నారు.
సంక్షోభంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రాథమిక అంచనాలు అందిన తరువాత, ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. నష్టపోయిన రైతులకు ఎంత పరిహారం ఇవ్వాలన్న దానిపై సీఎంతో చర్చించిన తర్వాతనే తుది నిర్ణయం ప్రకటిస్తామని మంత్రి తుమ్మల వెల్లడించారు. తక్షణ సాయంగా రూ.10 వేల పరిహారాన్ని మంత్రి ప్రకటించారు.
పంట పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో లక్షల ఎకరాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. వరి కోత సమయంలో నేలకొరగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిగుబడి పూర్తిగా తగ్గుతుందనే భయం వారిని వెంటాడుతోంది. కల్లాల్లో, రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం సైతం కొట్టుకుపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు.
రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో ఒక మహిళా రైతు వీడియోను షేర్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన తారవ్వ అనే మహిళా రైతు అధికారుల కాళ్లు పట్టుకుని ఆవేదన వ్యక్తం చేయడం, ఈ భారీ వర్షాలు రైతులకు ఎంతటి నష్టాన్ని మిగిల్చాయో అర్థం చేసుకోవడానికి ఒక నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల పరిహారం ఏ మాత్రం సరిపోదని పేర్కొన్నారు. ఆరుగాలం కష్టం నీటిపాలైన రైతులను ఆదుకోవాలంటే, ఒక్కో ఎకరాకు కనీసం రూ.50 వేల పరిహారం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.
కేవలం పరిహారం మాత్రమే కాకుండా, ఈ కష్టకాలంలో రైతులకు ప్రభుత్వం అదనపు భరోసా కల్పించాలని ఆమె అభిప్రాయపడ్డారు. యాసంగి పంటల సాగు కోసం రైతులకు ఉచితంగా విత్తనాలు, ఎరువులు అందించాలని, తక్షణమే రైతు భరోసా సాయాన్ని విడుదల చేయాలని కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి క్షేత్రస్థాయి పర్యటన
తుపాను బాధితులకు భరోసా ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. సీఎం పర్యటన తుపాను ప్రభావిత జిల్లాల్లో జరుగుతుందని మంత్రి తుమ్మల గతంలోనే ప్రకటించారు. దానిలో భాగంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు గ్రేటర్ వరంగల్‌లో విస్తృతంగా పర్యటించనున్నారు. హైదరాబాద్ బేగంపేట నుంచి మధ్యాహ్నం 12:45 గంటలకు బయలుదేరిన సీఎం, ముందుగా హుస్నాబాద్, వరంగల్‌లో వరద దెబ్బతిన్న ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు. ఆ తర్వాత, వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు మధ్యాహ్నం 1:45 గంటలకు చేరుకుంటారు. అక్కడ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి వరంగల్ నగరంలోని మూడు ప్రధాన కాలనీలలో పర్యటిస్తారు. ముంపుకు బాధితులతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి హన్మకొండ కలెక్టరేట్‌కు చేరుకుంటారు. అక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిసి వరద నష్టం, సహాయక చర్యలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు. ఇక్కడే తుది పరిహారంపై సీఎం కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.