Chicken Shops in Hyderabad | హైదరాబాద్: నగరంలో ఉన్న మాంసాహారులకు అధికారులు షాకిచ్చారు. హైదరాబాద్ లో గురువారం నాడు చికెన్, మటన్ షాపులు బంద్ ఉంటాయి. వీటితో పాటు కబేళాలు, బీఫ్ షాపులు సైతం మూసివేయాలని జీహెచ్ఎంసీ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి (Mahatma Gandhi Death Anniversary) సందర్భంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలోని అన్ని చికెన్, మటన్ షాపులు నేడు బంద్ కానున్నాయి.
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు..
జీహెచ్ఎంసీ యాక్ట్ 1955, సెక్షన్ 533బీ ప్రకారం జీహెచ్ఎంసీ కమిషనర్ కె లింబాద్రి నేడు మాంసం విక్రయాలు నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో నేడు చికెన్, మటన్ షాపులతో పాటు బీఫ్ షాపులు సైతం మూసివేయాలని.. ఆ మేరకు పోలీస్ కమిషనరేట్లలో చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ ఆదేశాలు అమలయ్యేలా పోలీసులు చూడాలన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి చికెన్, మటన్, బీఫ్ షాపులు ఓపెన్ చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
సాధారణంగా అయితే గాంధీ జయంతి సందర్భగా చికెన్ షాపులు, మటన్ షాపులు, వైన్స్ షాపులు బంద్ చేసేవారు. అక్టోబర్ 2న ప్రతి ఏడాది చుక్కా, ముక్కా బంద్ అయ్యేవి. కానీ తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. శాంతి, అహింస అనే ఆయుధాలతో దేశానికి స్వాతంత్య్రం సాధించిన మహాత్మా గాంధీ వర్ధంతి రోజున జీవ హింస చేయరాదని అధికారులు భావించారు. నేడు హైదరాబాద్ మాంసం విక్రయించే షాపులు బంద్ చేయాలని, ఎలాంటి విక్రయాలు జరపకూడదని జీహెచ్ఎంసీ కమిషనర్ ఓ ప్రకటన విడుదల చేశారు.