Just In





Telangana News: రికార్డు వేగంతో కుల గణన, సమగ్ర సర్వే- దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి
Caste census in Telangana | సమగ్ర ఇంటింటి సర్వే రికార్డు వేగంతో పూర్తి చేసి దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేబినెట్ సబ్ కమిటీకి ఫిబ్రవరి 2లోగా నివేదిక రానుంది.

హైదరాబాద్: ఇటీవల చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే (Samagra Kutumba Survey) దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. రాష్ట్ర (Telangana) ప్రభుత్వం చేపట్టిన సర్వేపై జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతున్నాయని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్కమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ సలహాదారులు కే.కేశవరావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సమగ్ర సర్వే డేటా ఎంట్రీ పూర్తి
సమగ్ర కుటుంబ సర్వే విజయవంతంగా నిర్వహించారంటూ అధికారులు, ఉద్యోగులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ కుల గణన ప్రక్రియ (Caste Census) సామాజిక సాధికారతతో పాటు, భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఇతర బలహీన వర్గాల అభ్యున్నతికి ఉపయోగపడుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన, సమగ్ర కుటుంబ సర్వేను చేపట్టి తమ చిత్తశుద్ధిని చాటుకుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ డెడికేటేడ్ కమిషన్ (BC Commission)కు ఈ గణాంకాలు ఉపయోగపడుతాయని చెప్పారు. సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ సైతం పూర్తయిందని, ఒకట్రెండు రోజుల్లో ముసాయిదా నివేదికను సమర్పిస్తామని అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. ఫిబ్రవరి 2 లోగా కేబినెట్ సబ్ కమిటీకి తుది నివేదికను అందజేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
తెలంగాణలో నవంబర్ 6న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే) ప్రభుత్వం ప్రారంభించింది. డిసెంబర్ మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర సర్వే పూర్తయింది. ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ సర్వేలో సూపర్ వైజర్లు, ఎన్యుమరేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు దాదాపు లక్ష మందికిపైగా పాలుపంచుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1.16 కోట్ల కుటుంబాలను సర్వే గుర్తించింది. ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించారు. దాదాపు 96 శాతానికి పైగా కుటుంబాల వివరాలను సర్వే టీమ్స్ విజయవంతంగా సేకరించాయి. ఆ వివరాల డేటా ఎంట్రీ సైతం పూర్తయింది. కొన్ని ఇండ్లకు తాళాలు ఉండటం, కొన్ని కుటుంబాలు సర్వేకు నిరాకరించటం, కొన్ని కుటుంబాలు అందుబాటులో లేకపోవటం లాంటి కారణాలతో కొన్ని కుటుంబాల వివరాలు సర్వేలో సేకరించడం వీలుకాలేదని సీఎం రేవంత్ రెడ్డికి అధికారులు వివరించారు.
రికార్డు వేగంతో కుల గణన
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే సీఎం నేతృత్వంలో భేటీ అయిన రాష్ట్ర మంత్రివర్గం ఇంటింటి సర్వే ద్వారా కుల గణన చేసేందుకు ఫిబ్రవరి 4న నిర్ణయం తీసుకుంది. ఈ సర్వే చేపట్టేందుకు ఫిబ్రవరి 16న అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేసింది. ఇంటింటి సర్వే కుల గణన చేపట్టేందుకు విధి విధానాలను ఖరారు చేసేందుకు ప్రభుత్వం సెప్టెంబర్ 12వ తేదీన కేబినేట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఆరుగురు మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేయగా, పలుమార్లు సబ్ కమిటీ సమావేశమైంది. అక్టోబర్ 9న కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన సిఫారసులపై రేవంత్ రెడ్డి చర్చించారు. కుల గణన కలిసి వచ్చేలా సమగ్ర కుటుంబ సర్వే చేపట్టడానికి ప్రణాళిక విభాగాన్ని నోడల్ ఏజెన్సీగా నియమించారు. అక్టోబర్ 10వ తేదీన సమగ్ర కుటుంబ సర్వే చేపట్టేందుకు పూర్తి విధి విధానాలతో జీవో నెం.18 ప్రభుత్వం జారీ చేసింది. ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లు వివరాలు సేకరించగా, డేటా ఎంట్రీ ఆపరేటర్లు సర్వే వివరాలను ఆన్‌లైన్ డేటా ఎంట్రీ పూర్తి చేశారు.
Also Read: Telangana News: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదోతరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్