Telangana SSC Exams News: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదోతరగతి విద్యార్థులకు రేవంత్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్షలను దృష్టిలో పెట్టుకొని వారికి సాయంత్రం వేళల్లో స్నాక్స్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ పథకం ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రానుంది. ఫిబ్రవరి ఒకటి నుంచి మార్చి 20 వరకు సాయంత్రం వేళల్లో పిల్లలకు స్నాక్స్ ఇస్తారు. దాదాపు 38 రోజుల పాటు ఈ పథకం అమలులో ఉంటుంది.
పరీక్షల వేళ పిల్లలకు స్టడీ అవర్స్ ఉంటాయి. సాయంత్రం ఇంటికి వెళ్లి స్నాక్స్ తినే టైంలో స్కూల్‌లో ఉంటున్నారు. అందుకే వారికి స్నాక్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మెనూ ఏంటన్నది మాత్రం తెలియడం లేదు. దీన్ని కూడా మధ్యాహ్నం భోజనం వండే వాళ్లకే ఇస్తారా లేకుంటే పూర్తి బాధ్యత ఉపాధ్యాయులకే అప్పగిస్తారా అనేది తేలాల్సి ఉంది.
తెలంగాణలో మార్చి 21వ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 2 వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. రోజూ ఉదయం 9.30 కి మొదలయ్యే పరీక్షలు మధ్యాహ్నం 12.30కి ముగుస్తాయి. ఈ పరీక్షల్లో కూడా ప్రభుత్వం కీలక మార్పులు చేర్పు చేసింది. గ్రేడింగ్ విధానంతోపాటు ఇంటర్నల్ మార్కుల పద్ధతిని కూడా తీసిపారేసింది. అంటే ఈసారి జరిగే పరీక్షలు పూర్తిగా వంద మార్కులకు జరగనున్నాయి.