నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో తెలుగు రాష్ట్రాలపై వర్షాలు బాగా పడుతున్నాయి. సోమవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకూ తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో విపరీతమైన వర్షం పడింది. ఈ భారీ వర్షాలకు పల్లపు ప్రాంతాలు అన్నీ జలమయమయ్యాయి. కొన్ని చోట్ల రహదారులపై నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో వికారాబాద్‌లో పడిన వర్షాలకు ఇదే పరిస్థితి తలెత్తింది. ఓ పెళ్లి బస్సుకు పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.
హైదరాబాద్ బోరబండకు చెందిన ఈ పెళ్లి వారు ప్రత్యేక బస్సులో వికారాబాద్ జిల్లాకు వెళ్లగా అక్కడ భారీగా నిల్వ ఉన్న వరద నీటిలో చిక్కుకుపోయింది. కోటపల్లి మండలం బర్వాద్ గ్రామానికి పెళ్లి బస్సు వచ్చింది. వివాహం చూసుకొని తిరుగు ప్రయాణంలో రాత్రి సుమారు 11 గంటల సమయంలో కేసారం రైల్వే బ్రిడ్జి కింద బస్సు చిక్కుకుపోయింది.
వరద నీటిలో చిక్కుకుంది. బస్సు ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక అక్కడే ఇరుక్కుపోయింది. బస్సు ఆ లోతట్టు ప్రాంతంలోనే ఉండడంతో లోపలికి వరద నీరు వచ్చేసింది. క్రమంగా లోపల నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంటుండడంతో అప్రమత్తమైన పెళ్లి బృందం హుటాహుటిన బస్సులో నుంచి కిందకు దిగేశారు. దీంతో అంతా ప్రాణాలతో బయట పడ్డారు. తెల్లారే సరికి బస్సు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. గమనించిన రైల్వే సిబ్బంది, స్థానికులు మోటార్ల ద్వారా నీటిని పారబోసి, బస్సును బయటకు తీశారు.
అయితే, ఈ రైల్వే బ్రిడ్జి పనులు మెల్లగా సాగుతున్నాయని స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. ఇంతకుముందు కూడా ఇలాంటి ఘటనలు జరిగినా, అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదని మండిపడ్డారు. తొందరగా త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేసి తమను ప్రమాదం నుంచి బయట పడేయాలని కోరారు.