Sunitha Mahender Reddy Praised Doctors: వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని వైద్యుడ్ని దైవంతో పోలుస్తూ వైద్యో నారాయణో హరి అని మన పెద్దవాళ్లు ఎప్పుడో చెప్పారని మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి (Patnam Sunitha Mahender Reddy) అన్నారు. కూకట్ పల్లి డాక్టర్స్ అసోసియేషన్ (Kukatpally Doctors Association) ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఇంటరాక్షన్ విత్ డాక్టర్స్ పేరుతో డాక్టర్ విన్నకోట శ్రీ ప్రకాష్ సారథ్యంలో మైక్రో కేర్ ఈఎన్ టీ రీసెర్చ్ యూనిట్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పట్నం సునీత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైద్యులపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా ప్రాణాన్ని నిలబెట్టే వైద్యులు నిజంగానే మరో దేవుడితో సమానమని అన్నారు. కరోనా పరిస్థితుల్లోనూ తమ ప్రాణాలను లెక్కచేయక రోగులకు వైద్యం అందించడం గొప్ప విషయo అభినందనీయం అన్నారు.  డబ్బుల కంటే సేవే ముఖ్యమనుకునే డాక్టర్లకు సమాజంలో మంచి గౌరవం లభిస్తుందని అన్నారు.


ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీ ప్రకాష్ (Sri Prakash) మాట్లాడుతూ.. లీడర్స్ తో డాక్టర్స్ పరిచయ వేదిక ద్వారా ప్రజలకు జరిగే మేలు గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా కూకట్పల్లి డాక్టర్స్ అసోసియేషన్ కు 1500 గజాల స్థలాన్ని కేటాయించినట్లయితే అక్కడ భవనం నిర్మించి 24 గంటలు పేద ప్రజలకు వైద్య సేవలు చేయనున్నట్టు అసోసియేషన్ ప్రతినిధులు సునీతకు వినతి పత్రం అందజేశారు. దీనిపై ఆమె సానుకూలంగా స్పందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి స్థలం కేటాయించేందుకు ప్రయత్నిస్తామన్నారు. సమావేశంలో పాల్గొన్న మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. తల్లి ప్రాణం పోస్తే వైద్యుడు ప్రాణం నిలబెడతాడని అన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ లో ఒకే రోడ్ లో అన్ని వ్యాధులకు చికిత్స చేసేలా హాస్పిటల్స్ ఉండడం అన్ని వైద్య సేవలు ఒకే దగ్గర లభించడం అభినందనీయమన్నారు. ఈ  సందర్భంగా కార్యక్రమానికి సారథ్యం వహించిన డాక్టర్ విన్నకోట శ్రీ ప్రకాష్ ని ప్రస్తావిస్తూ లీడర్లతో కలిసి డాక్టర్లు సమాజ సేవ చేయాలనే దృక్పథాన్ని అభినందించారు.


కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ బండి రమేష్ మాట్లాడుతూ.. దేవుడి తర్వాత స్థానం ప్రాణాలు నిలిపి వైద్యుడిదేనని అన్నారు. వైద్యులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. అసోసియేషన్ కి సంబంధించి ఏ సమస్య ఉన్నా పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. విద్యాధికురాలు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే పట్నం సునీతను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో డాక్టర్లు సంపత్ రావు, విన్నకోట శ్రీ ప్రకాష్, డాక్టర్ మధుసూదన్, డాక్టర్ రవికుమార్, డాక్టర్ సంపత్ రావు, డాక్టర్ రవికృష్ణ, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Also Read: MLC Dande Vital : బీఆర్ఎస్‌కు మరో ఎమ్మెల్సీ మైనస్ - దండె విఠల్ ఎన్నిక చెల్లదన్న హైకోర్టు