Flights Left Without Passengers In Shamshabad: ప్రయాణికులను ఎక్కించుకోకుండానే విమానాలు వెళ్లిపోయిన ఘటన శంషాబాద్ (Shamshabad)లో గురువారం జరిగింది. ఓ ఎయిర్ లైన్స్ సంస్థకు చెందిన సర్వర్ డౌన్ కావడంతో ప్రయాణికులను ఎక్కించుకోకుండానే ఆ సంస్థ విమానాలు వెళ్లిపోయాయి. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలకు వెళ్లేందుకు దేశీయ విమాన సర్వీసుల్లో ప్రయాణికులు ఓ ఎయిర్ లైన్స్ సంస్థలో టికెట్లు కొనుగోలు చేశారు. ఈ క్రమంలో కొందరు ప్రయాణికులు ఎయిర్ పోర్టుకు చేరుకుని వెబ్ చెక్ ఇన్ కోసం ప్రయత్నించగా సర్వర్ పని చేయలేదు. దీంతో టికెట్లు ఉన్నప్పటికీ ప్రయాణికుల జాబితాలో వారి పేరు లేదని విమానాశ్రయ సిబ్బంది లోపల గేటు వద్ద వారిని అనుమతించలేదు. దీంతో సహనం కోల్పోయిన కొందరు ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే, దీనిపై ఆలస్యంగా స్పందించిన యాజమాన్యం తమ వేరే సర్వీసుల్లో వారిని గమ్యస్థానాలకు పంపిస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. కాగా, ఈ సమస్య తమ దృష్టికి రాలేదని.. సర్వర్ పునరుద్ధరించుకునే బాధ్యత సంబంధింత ఎయిర్ లైన్స్ దే అని ఎయిర్ పోర్ట్ అధికారులు స్పష్టం చేశారు.
చిక్కిన చిరుత
మరోవైపు, వారం రోజులుగా శంషాబాద్ ప్రజలు, అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న చిరుత ఎట్టకేలకు శుక్రవారం చిక్కింది. అటవీ అధికారులు చేపట్టిన ఆపరేషన్ చిరుత విజయవంతమైంది. ఐదు రోజుల క్రితం ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టులో 5 రోజుల క్రితం చిరుత కదలికలను అధికారులు గుర్తించారు. గొల్లపల్లి నుంచి ప్రహరీ గోడ దూకినట్టు గమనించారు. ఎయిర్‌పోర్టు పరిధిలో చిరుత ఉందని తెలుసుకున్న అధికారులు, ప్రజలు, ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎయిర్ పోర్ట్ ప్రహరీ చుట్టూ అధికారులు గోడకు ఫెన్సింగ్ వైర్‌లు ఫిట్ చేసి ఉన్నారు. చిరుత అటూ ఇటూ తిరిగే క్రమంలో ఆ ఫెన్సింగ్‌కు తాకింది. దీంతో ఎయిర్‌పోర్టులో అలారమ్ మోగింది. అప్రమత్తమైన కంట్రోల్‌రూమ్ సిబ్బంది అసలు విషయాన్ని గుర్తించి అక్కడ చిరుత దాంతో పాటు రెండు పిల్లలు ఉన్నట్టు నిర్దారించారు. వెంటనే అప్రమత్తమై చిరుతను పట్టుకునేందుకు ఆపరేషన్ చిరుత ప్రారంభించారు. చిరుతను తిరిగే ప్రాంతాలను గుర్తించి.. దాన్ని బంధించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు.
మేకను ఎరగా వేసి
చిరుత తరచూ వచ్చే ప్రాంతంలో బోను ఏర్పాటు చేశారు అధికారులు. ఎరగా మేకను ఉంచారు. అయితే ఆ బోను వరకు వచ్చిన చిరుత తిరిగి వెళ్లిపోయింది. 5 రోజులుగా ఇలాగే అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది. ఎట్టకేలకు అధికారుల కృషి ఫలించింది. ఎరగా ఉన్న మేకను తినేందుకు వచ్చి బోనులో చిక్కింది. వెంటనే చిరుతను బంధించిన అధికారులు జూ వద్దకు తరలించారు. చిరుత పిల్లలు ఉన్నాయా... వాటి పరిస్థితి ఏంటన్నది ఇంకా తెలియాల్సి ఉంది.