T20 World Cup 2024: జూన్ నెలలో అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్(T20 world Cup) 2024కు భారత జట్టు ఎంపికపై బీసీసీఐ(BCCI) చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్(Ajit Agarkar), కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) స్పందించారు. రింకూ సింగ్‌కు స్థానం రాకపోవడం దురదృష్టకరమని అన్నారు. జట్టులో అదనపు బౌలర్ ఉండాలని, అందుకే రింకూ సింగ్‌ను తప్పించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. స్పిన్నర్ల విషయంలో కెప్టెన్ రోహిత్ శర్మకు మరిన్ని ఆప్షన్లు ఇచ్చేందుకు ఇద్దరు రిస్ట్ స్పిన్నర్లను ఎంపిక చేశామని పేర్కొన్నారు. జట్టును ప్రకటించిన రెండు రోజుల తర్వాత గురువారం ముంబైలో సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. జట్టు ఎంపిక గురించిన ప్రశ్నలకు వారు సమాధానం ఇచ్చారు.
రింకూను తప్పించక తప్పలేదు ..
టీ 20 వరల్డ్ కప్ లో రింకూ సింగ్ ను పక్కన బెట్టి నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ రోహిత్, అగార్కర్ ఉమ్మడి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. టీంలో రింకూ సింగ్‌కు చోటు దక్కకపోవటంపై అగార్కర్ స్పందిస్తూ.. అది దురదృష్టకరమని అన్నారు. జట్టులో అదనపు బౌలర్ అవసరమని, అందికే రింకూను తప్పించాల్సి వచ్చిందని, అంతే కానీ రింకూ సింగ్ ఎలాంటి తప్పు చేయలేదని, శుభమాన్ గిల్ విషయంలో కూడా అదే నిజమని అగార్కర్ చెప్పాడు. ఇక స్పిన్నర్ల విషయానికొస్తే., కెప్టెన్ రోహిత్ శర్మకు మరిన్ని ఆప్షన్లు ఇవ్వడానికి ఇద్దరు రిస్ట్ స్పిన్నర్లను ఎంపిక చేశామని., అందుకే అక్షర్ పటేల్‌ను జట్టులోకి తీసుకువచ్చామన్నారు. ఈ కారణంతోనే రింకూ సింగ్ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని తెలిపారు. అతను రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో ఉన్నాడంటేనే 15 మందిలో ఉండడానికి అతడు ఎంత చేరువగా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చన్నారు.
కేఎల్ రాహుల్ ఎంపిక కాకపోవటంపై స్పందించిన రోహిత్ రాహుల్ టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తాడని, కానీ తాము మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయగల ఆటగాళ్లను ఎంపిక చేశామని అన్నారు. మన టాప్ ఆర్డర్ హిట్టింగ్ మరీ అంత పేలవంగా లేదన్న రోహిత్ అసలు ఐపీఎల్‌కు ముందే టి 20 జట్టుపై తమకు స్పష్టత ఉందని, కొన్ని స్థానాల కోసం మాత్రమే ఐపీఎల్ ఆట తీరును పరిగణ లోకి తీసుకున్నామన్నారు. స్పిన్నర్ల విషయంలో అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ మధ్య పోటీ నెలకొందని అయితే అక్షర్ పటేల్ ఆల్‌రౌండర్ కావడం, ప్రస్తుతం ఐపీఎల్‌లో అతడు చక్కటి ఫామ్‌లో ఉండడంతో జట్టులోకి తీసుకున్నామని రోహిత్ చెప్పాడు. అలాగే హార్ధిక్ పాండ్యా మంచి ఆటగాడని, దీంతో జట్టు సమతుల్యం విషయంలో కెప్టెన్ రోహిత్ శర్మకు చాలా సానుకూలంగా ఉంటుందని అగార్కర్ తెలిపారు. ఇక విరాట్ కోహ్లి స్ట్రైక్ రేట్‌పై చర్చలే లేవని అన్నారు. ప్రస్తుత ఐపీఎల్‌లో కోహ్లీ అద్భుత బ్యాటింగ్ తో ప్రశంసలు అందుకుంటున్నాడన్నారు.
భారత టీ 20 జట్టు :
రోహిత్ శర్మ (కెప్టెన్ ), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్ ),సంజు శాంసన్ (వికెట్ కీపర్ ), హార్దిక్ పాండ్య (వికెట్ కీపర్ ), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చాహల్ , అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, ముహమ్మద్ సిరాజ్,
ట్రావెలింగ్ రిజర్వ్ : శుభ్‌మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్‌ఖాన్