బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును చర్లపల్లి జైలుకు పంపుతానని మల్కాజిగిరి బీజేపీ నేత పీఎం సాయి హెచ్చరించారు. మల్కాజిగిరిలో మైనంపల్లి హనుమంత రావు గూండా రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. తనను చంపుతానని బెదిరింపులకు దిగుతున్నాడని.. చంపుతాను అంటూ ఫోన్ ద్వారా మెసేజ్ లు, కాల్స్ చేసి బెదిరిస్తున్నారని ఆరోపణలు చేశారు. మైనంపల్లి అనుచరులు.. అధికారులను బెదిరిస్తూ భూ కబ్జాలకు, అక్రమాలు, అరాచకాలకు పాల్పడ్డారని చెప్పారు. మల్కాజిగిరి ప్రజలకు అండగా బీజేపీ తరపున టీం సాయి పనిచేస్తుందని చెప్పారు. మైనంపల్లి అరాచకాలకు అడ్డుకట్ట వేసే సమయం ఆసన్నమైందని అన్నారు
మాయమాటలు చెప్పి ఎమ్మెల్యేగా గెలిచిన మైనంపల్లిపై ప్రజలు విరక్తి చెందుతున్నారని పీఎం సాయి కుమార్ అన్నారు. ప్రజలు సహకరిస్తే రానున్న ఎన్నికల్లో ఓడించి మైనంపల్లిని చర్లపల్లి కారాగారానికి పంపుతానని అన్నారు. తాము 9603596015 అనే టోల్ ఫ్రీ నెంబర్ ను విడుదల చేస్తున్నామని.. మైనంపల్లి బెదిరింపులకు ఎవరూ భయపడవద్దని, బెదిరింపులకు పాల్పడితే ఆ నెంబరుకు ఏ సమయంలోనైనా మెసేజ్ కానీ, కాల్స్ రూపంలో సంప్రదించాలని పీఎం సాయి కుమార్ చెప్పారు.
మూడు వారాల క్రితం బుల్డోజర్లతో హడావుడి
మల్కాజ్ గిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని.. బుల్డోజర్లతో కూల్చివేసే ప్రయత్నాలు జరిగాయి. పీఎం సాయి ఆధ్వర్యంలో మైనంపల్లి ఆస్తుల విధ్వంసానికి బుల్డోజర్లు కదిలాయి. మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి రౌడీయిజం, భూకబ్జాలను బయటపెట్టేందుకంటూ బీజేపీ యువనేత సాయి భారీ బైక్ ర్యాలీ ఏర్పాటుచేశారు. 'జాగో మల్కాజ్‌గిరి' పేరిట దాదాపు 1,500 బైకులతో ఈ యాత్ర సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కబ్జా చేసిన ఆస్తులంటూ కొన్ని భవనాలపై పబ్లిక్ ప్రాపర్టీ అని రాయించారు. ఇక ఆల్వాల్ రాక్ ల్యాండ్ అవెన్యూలో వెలిసిన భూములు హనుమంతరావు కబ్జా చేసినవి అంటూ కమాన్ వద్ద ఉన్న బోర్డు ధ్వంసం చేసేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నించాయి. రాక్ ల్యాండ్ అవెన్యూ ఆఫీస్, కమాన్ బోర్డ్ ను బుల్డోజర్ లతో కూల్చేందుకు సాయి వర్గం సిద్దమవగా పోలీసులు అడ్డుకున్నారు.