హైదరాబాద్: జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి రాజకీయంగా కలకలం రేపుతోంది. తన కుమారుడు గోపీనాథ్ మరణంపై తల్లి మాగంటి మహానందకుమారి అనుమానాలు వ్యక్తం చేశారు. గోపీనాథ్ ఎప్పుడు చనిపోయారో తల్లిగా తనకే తెలియదని, అలాంటి పరిస్థితి తనకు కల్పించారని ఆవేదన చెందారు. గోపీనాథ్ కుమారుడు సైతం తన తండ్రి మరణంపై అనుమానాలు ఉన్నాయని, దీనిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి తమకు న్యాయం జరిపించాలని కోరాడు.
మాగంటి గోపీనాథ్ తల్లి మాగంటి మహానందకుమారి సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. ‘నా కుమారుడి మరణంపై అన్ని కోణాల్లోనూ అనుమానాలు ఉన్నాయి. మాగంటి గోపీనాథ్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు, తల్లిగా ఒక్కసారైనా చూసేందుకు నాకు అవకాశం ఇవ్వలేదు. కేటీఆర్ వచ్చిన తర్వాతే గోపీనాథ్ మరణం గురించి ప్రకటించారు. వారసత్వ పత్రంలో తన పేరు, మొదటి భార్య, బిడ్డల పేర్లు లేవు. ఇది కేవలం డబ్బు సమస్య కాదు. మా కుటుంబానికి తలెత్తిన గుర్తింపు సమస్య.
గోపీనాథ్ మొదటి భార్య మాలినితో చట్టపరంగా విడాకులు తీసుకోలేదు. నేను గోపీనాథ్ తల్లినైనా, కేటీఆర్ ఎప్పుడూ ఎన్నడూ కలవలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల టికెట్ సునీతకు ఇచ్చినప్పుడైనా ఒక మాట చెబితే బాగుండేది. మా కుటుంబ సమస్య, వారసత్వ సమస్యను ఆయనకు చెప్పేవాళ్లం. ఎమ్మెల్యే సీటు కోసం నా పెద్ద కుమారుడు కూడా ప్రయత్నించారు. ఈ విషయాన్ని నేరుగా కేటీఆర్ వద్ద ప్రస్తావించే అవకాశం రాలేదు. లీగల్ హైర్ సర్టిఫికెట్‌లో తమ పేర్లను చేర్చడం కోసం ఆగస్టు 11 నుంచి ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాలేదు. ’ మాగంటి గోపీనాథ్ తల్లి మహానందకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. .
సునీతపై మాగంటి గోపీనాథ్ కుమారుడి ఆరోపణలు
మాగంటి గోపీనాథ్ కుమారుడు తారక్ ప్రద్యుమ్న సైతం తన తండ్రి మరణంపై అనుమానాలు వ్యక్తం చేశాడు. తన పాస్‌పోర్టుతో పాటు ఇతర అన్ని అధికారిక పత్రాలలో తండ్రిగా మాగంటి గోపీనాథ్ పేరే ఉందన్నాడు. ఎమ్మార్వో ఆఫీసులో ఆ వివరాలన్నీ సమర్పించినట్లు తెలిపారు. తన తల్లి, తండ్రి చట్టపరంగా విడాకులు తీసుకోలేదన్నాడు. తాను ఎవరో తెలియదని సునీత అంటున్నారని.. అయితే తానెవరో తెలియకుండానే జూన్ 6న నాకు తొలిసారి ఎలా ఫోన్ చేశారని ప్రద్యుమ్మ ప్రశ్నించాడు. తన గ్రాడ్యుయేషన్ రోజుకు రావాలని నాన్న అనుకున్నారని, అంతలోనే ఆయన హఠాత్తుగా చనిపోయారని వెల్లడించాడు. తర్వాత కొన్నిరోజులకు సునీత తనకు ఫోన్ చేసి నన్ను ఇండియా రావాల్సిన అవసరం లేదన్నారు. కేటీఆర్ అంకుల్ తో మాట్లాడి అక్కడి కంపెనీల్లో జాబ్ ఆఫర్ చేశారని జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతపై ఆరోపణలు చేశాడు.