Durgam Cheruvu Cable Bridge: మాదాపూర్ సీఐ గడ్డం మల్లేష్ వివాదంలో చిక్కుకున్నారు. కేబుల్ బ్రిడ్జిపై మాదాపూర్ సీఐ  నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కేబుల్ బ్రిడ్జ్ పై బర్త్ డే పార్టీలు నిషేధం అంటూ గతంలో ప్రకటనలు ఇచ్చారు. తాజాగా అదే కేబుల్ బ్రిడ్జిపై బర్త్ డే పార్టీలో మాదాపూర్ సీఐ మల్లేష్ పాల్గొన్నారు. ప్రమాదాలు జరుగుతున్నందున వంతెనపై పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటే చర్యలు తీసుకుంటామంటూ గతంలో ప్రకటనలు ఇచ్చారు. కొద్ది నెలల క్రితమే హెచ్చరికలు జారీ చేశారు. అలాంటి సీఐ సీఐ మల్లేష్ నిబంధనలు ఉల్లంఘించారు.


ఆయన వంతెనపై పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న తాలుకు ఫోటోలు వైరల్ కావడంతో నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. ఆయన నిబంధనలు తమకు వర్తించవని రుజువు చేశారని అన్నారు. కేబుల్ బ్రిడ్జిపై పార్టీలు చేస్తుంటే సెక్షన్ 188 ప్రకారం శిక్ష అర్హులంటూ గతంలో సీఐ ప్రకటన ఇచ్చారు. ఇకపై ఎవరైనా కేబుల్ బ్రిడ్జిపై వాహనాన్ని నిలిపితే రూ.1000 ఫైన్ విధిస్తామని కూడా వార్నింగ్ ఇచ్చారు. 


కొంత మంది వాహనదారులు బ్రిడ్జిపై పక్కన వాహనాలు నిలిపి సెల్ఫీలు, ఫోటోలు దిగుతున్నారు. ఈ క్రమంలో తరచూ ప్రమాదాలు జరిగాయి. గత నెల మొదటివారంలో కూడా కేబుల్ బ్రిడ్జిపై వాహనాన్ని నిలిపి సెల్ఫీ తీసుకున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఎప్పుడూ రద్దీగా ఉండే కేబుల్ బ్రిడ్జిపై వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సి ఉండగా.. సెల్ఫీల సరదాలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు మరోసారి అప్రమత్తం అయ్యారు. ఆ బ్రిడ్జిపై ప్రమాదాలు పూర్తిగా నివారించేలా సహకరించాలని కోరారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని గత నెలలో హెచ్చరించారు. బర్త్ డే వేడుకలకు సైతం కేబుల్ బ్రిడ్జిపై అస్సలు అనుమతి లేదని చెప్పారు.