Police Raids On Pub In Hyderabad: హైదరాబాద్ (Hyderabad)లోని ఓ పబ్ పై శనివారం అర్ధరాత్రి పోలీసులు దాడులు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి పబ్ లో అసభ్యకర నృత్యాలు చేయిస్తున్నట్లు గుర్తించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని 'ఆఫ్టర్ నైన్' పబ్ పై దాడి చేసిన పోలీసులు దాదాపు 160 మంది యువతీ యువకులను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా సమయం దాటిన తర్వాత కూడా పబ్ కొనసాగుతోందని.. అందుకే దాడులు చేసినట్లు పోలీసులు తెలిపారు. కస్టమర్లను ఆకర్షించేందుకు ఇతర రాష్ట్రాలకు చెందిన 40 మంది యువతులతో పబ్ నిర్వాహకులు అసభ్య నృత్యాలు చేయిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు పబ్ నిర్వాహకులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. యువతీ యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వీరికి 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసి వివరాలు సేకరించి పంపుతున్నారు. పబ్ లో పట్టుబడిన యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. యువతులను రెస్క్యూ హోమ్ కు తరలిస్తామని పోలీసులు వెల్లడించారు. ఎక్సైజ్ అధికారులతో మాట్లాడి.. పబ్ ను పూర్తిగా మూసివేసేలా చర్యలు చేపడతామని అన్నారు. అటు, పబ్ లో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలోనూ ఆ దిశగానూ దర్యాప్తు చేస్తున్నారు.

Continues below advertisement


Also Read: Darshanam Mogulaiyya: కిన్నెర మొగిలయ్యకు కేటీఆర్ ఆర్థిక సాయం - కళాకారులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్న కేటీఆర్