Light Mens Strike | హైదరాబాద్: 30 శాతం జీతాలు పెంపుకోసం సినీ కార్మికులు చేపట్టిన సమ్మె మరింత ఉదృతం అవుతోంది. తాజాగా అగ్నికి ఆజ్యం పోసినట్లుగా నిర్మాత విశ్వప్రసాద్ చేసిన వ్యాఖ్యలు కార్మికుల్లో కాకరేపాయి. నిర్మాతలతో ఫెడరేషన్ పెద్దలు పలుమార్లు చర్చలు జరిపినా ప్రయోజనం లేదు. కేవలం 15 శాతం మాత్రమే జీతాలు పెంచుతామని, అదికూడా కండీషన్స్ అప్లై అంటూ నిర్మాతలు చెప్పడంతో పూర్తి స్దాయిలో షూటింగ్స్ బంద్ కు తెలుగు సినీ ఎంప్లయిస్ ఫెడరేషన్ సిద్ధంగా ఉంది.
తెలుగు సినీ ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్ లో భాగమైన లైట్ మ్యాన్ పడే ఇబ్బందులు, షూటింగ్ సమయంలో వారి పాత్ర, వచ్చే వేతనాలు, పని సమయం, కష్టం ఇలా అనేక అంశాలపై లైట్ మ్యాన్స్ ను సంప్రదించింది ఏబిపి దేశం. లైట్ మ్యాన్స్ చెప్పిన వివరాలిలా ఉన్నాయి.
సగం రోజులు పని ఉండదు..
నెల మొత్తం మాకు షూటింగ్స్ ఉండవు. పదిహేను రోజులు షూటింగ్స్ దొరకడమే కష్టంగా మారింది. షూటింగ్ ఉన్న రోజు మేము తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేస్తాము. 5 గంటలకే లైటింగ్ తెచ్చేందుకు ఆఫీసుకు వెళ్లాలి. ఉదయం 6గంటలకల్లా లైటింగ్ సమానుతో షూటింగ్ స్పాట్ కు చేరుకోవాలి. రాత్రి 9 గంటలకు వరకూ షూటింగ్ స్పాట్ లోనే ఉంటాం. ఇంటికి చేరేసరికి రాత్రి 11గంటలు దాటిపోతుంది. పేరుకే 12 గంటలు కాల్ షీట్ అని చేప్పడమే తప్ప, షూటింగ్ రోజు చెప్పిన సమయం కన్నా ఎక్కువ గంటలే మాతో పనిచేయిస్తున్నారు.
షూటింగ్ ఉన్నరోజు ఒక్కో లైటింగ్ బాయ్ కి 1300 రూపాయలు ఇస్తారు. అందులో 200 రూపాయాలు ట్రాన్సఫోర్ట్ కు ఖర్చు అవుతుంది. నెలలో 15 రోజులు మాత్రమే షూటింగ్ ఉంటుంది. నెలకు మహా అయితే 20వేలకు మించి సంపాదన ఉండదు. కొందరు నిర్మాతల మాకు నెలకు లక్షరూపాయలు ఇస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
రేపే రిలీజ్ అన్నట్లు టెన్షన్ పెడతారు..
టీవి సీరియల్స్ షూటింగ్ రోజులో ఒకటి లేదా రెండు ఎపిసోడ్స్ చేస్తారు. ఇప్పుడు సినిమా షూటింగ్స్ మాత్రం రేపే రిలీజ్ అన్నట్లుగా కార్మికులను విపరీతంగా టెన్షన్ పెడుతున్నారు. మాకు ఇష్టమైన పని కావడంతో ఎన్ని ఇబ్బందులు అనుభవిస్తున్నా మర్చిపోతున్నాం. కొందరు నిర్మాతలు మమ్మలను సాఫ్ట్ వేర్ ఎంప్లయిస్ తో పోల్చుతున్నారు. కానీ మాపని అత్యంత కష్టతంతో కూడుకున్న పని. నెలలో కుటుంబాన్ని పోషించడమే కష్టంగా మారిన జీవితాలు మాావి.
తేడావస్తే కాలి బూడిదైపోతాం..
షూటింగ్ స్పాట్ లో లైట్ మ్యాన్ పని ఎలా ఉంటుందంటే.. ఒక్కో లైట్ 4వేల వాట్స్ నుండి 18వేల వాట్స్ కెపాసిటితో ఉంటుంది. అంతలా ప్రమాదకరమైన లైట్స్ ను ఆన్ లో ఉండగానే కెమెరామెన్ ఎక్కడ పెట్టమంటే లొకేషన్ లో అక్కడ వరకూ బుజాలపై మొస్తూ ఎంత దూరమైనా తీసుకెళ్తాం. తేడావస్తే కాలి బూడిదైపోతామని తెలిసినా తప్పని పరిస్దితి. షూటింగ్ స్పాట్ లో కొండలమీద గుట్టలమీద , తొమ్మిది ఫ్లోర్లు ఎత్తున్న బిల్డింగ్ పైకి, తాళ్లతో కట్టిన ఫ్లాట్ ఫామ్ ఫైకి లైట్లు ఎక్కిస్తాం.
సినిమాలు బాగా ఆడినప్పుడు కార్మికులకు లాభాలు ఇవ్వలేదు. ఇప్పుడు వారు హామీ ఇచ్చిన విధంగానే మా జీతాలు పెంచమని అడిగితే మాత్రం నష్టాల గురించి కొందరు నిర్మాతలు మాట్లడం సరికాదు. సినీ పరిశ్రమపై అభిమానంతో దశాబ్దాల నుండి ఈ వృత్తిని నమ్ముకుని పనిచేస్తున్నాం. మా కుటుంబాలన్ని పోషించుకోవాలి. అద్దె ఇళ్లలో బ్రతకాలి. పిల్లల ఫీజులు కట్టాలి. ఇవన్నీ భరిస్తూ హైదరాబాద్ వంటి నగరంలో బ్రతుకుతున్నాం. 15రోజుల షూటింగ్ లో వచ్చిన డబ్బుతోనే నెలంతా పొదుపుగా వాడుకుంటున్నాం. నెలలో షూటంగ్స్ లేకపోతే బయట వడ్డీకి తెచ్చుకుంటే తప్ప ఇళ్లు గడవని పరిస్దితి మాది.ఇండస్ట్రీ పెద్దలకు లైట్ మ్యాన్ యూనియన్ తరుపున వేడుకుంటున్నాం. మాకు 30శాతం జీతాలు పెంచాలి. అప్పటి వరకూ లైట్ మ్యాన్ షూటింగ్స్ కు దూరంగా ఉంటామని చెప్పారు.