Telangana Rains News Update | అమరావతి: ఉత్తర కోస్తాంధ్రపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంగా మంగళవారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజలు చెట్లు, పాతభవనాలు లేదా హోర్డింగ్స్ వంటి ప్రమాదకర ప్రాంతాల్లో ఉండరాదని హెచ్చరించారు.

బుధవారం అల్పపీడనం..

ఆగస్టు 13నాటికి వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని విపత్తుల సంస్థ పేర్కొంది. దీని ప్రభావంతో బుధవారం, గురువారం కోస్తాంధ్ర ప్రాంతాల్లో వడగండ్ల వర్షాలు, చెదురుమదురు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మంగళవారం నాడు పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.

ఏపీలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, విపత్తుల నిర్వహణ సంస్థ నిర్వహిస్తున్న కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 1800 425 0101 ద్వారా సహాయం కోరవచ్చని ప్రఖర్ జైన్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన హెచ్చరించారు. ఆగస్ట్ 11 సోమవారం సాయంత్రం 5 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి: కాకినాడ జిల్లా రౌతలపూడిలో 42.2 మిల్లీమీటర్లు, అల్లూరి జిల్లా పెదబయలులో 41 మి.మీ, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 40.2 మి.మీ, గుంటూరు జిల్లా బేతపూడిలో 38 మిల్లీమీటర్లు వర్షం నమోదైంది.

తెలంగాణపై అల్పపీడనం ప్రభావంబంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం తెలంగాణపై ప్రభావం చూపనుంది. అనుకూలమైన పరిస్థితులు వేగంగా ఏర్పడటం వల్ల భారీ వర్షాలు సంభవించే అవకాశం ఉంది. మొదట దీని ప్రభావంతో ఆగస్ట్ 14 నుండి 17 వరకు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. కానీ ఇప్పుడు ఆగస్ట్ 12 నుంచి 16 తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్, హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీతెలంగాణలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా వరంగల్, హన్మకొండ, సూర్యాపేట, యాదాద్రిలో తుపాను లాంటి వర్షాలు కురుస్తున్నాయి. ఈ జిల్లాల్లో చాలా చోట్ల 150 నుంచి 200 మిమీ వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హన్మకొండ, వరంగల్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో వచ్చే 2 గంటల పాటు భారీ వర్షాలున్నాయి. వాటితో పాటు హైదరాబాద్, నల్గొండ, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయి.హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం వరకు కొన్ని గంటలపాటు తేలికపాటి వర్షం కురుస్తుంది. సాయంత్రం నుంచి రాత్రి వరకు పలుచోట్ల వాన పడుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.