KTR sent legal notice to Bandi Sanjay | హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) జరిగిందని బండి సంజయ్ ఆరోపించారు. అప్పటి మంత్రి కేటీఆర్ ప్రోద్బలంతో పోలీసులు తన ఫోన్, తన భార్య ఫోన్ ట్యాపింగ్ చేశారని.. కుటుంబ వ్యక్తిగత ఫోన్ సంభాషణలు విన్నారని బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. తన కుటుంబసభ్యులతో పాటు బంధువులు, ఇంట్లో పనిచేసే సిబ్బంది ఫోన్లు ట్యాపింగ్ చేసి వివరాలు తెలుసుకుని ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీఆర్ఎస్ నేతలు చూశారని బండి సంజయ్ అన్నారు.

ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపణలు

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ అంశంలో అడ్డగోలుగా ఆరోపణలు చేశారని పేర్కొంటూ బండి సంజయ్ సంజయ్‌కు కేటీఆర్ నోటీసులు ఇచ్చారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అవాస్తవాలు ప్రచారం చేశారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 48 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానన్న కేటీఆర్ తాజాగా బండి సంజయ్‌కు లీగల్ నోటీసులు పంపించారు.

కుటుంబసభ్యుల ఫోన్లు సైతం ట్యాపింగ్ చేశారంటూ సంచలనం.. 

ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తన ఫోన్ తో పాటు కుటుంబసభ్యులైన హరీష్ రావు, కల్వకుంట్ల కవితల ఫోన్లు కూడా ట్యాప్ చశారని పేర్కొన్నారు. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ ఆదేశాలతో SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఫోన్లు ట్యాపింగ్ చేపించారని బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేయలేదని కేటీఆర్ ప్రజలకు నిరూపించుకోవాలంటే ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. తాను గతంలోనే ఆలయానికి వెళ్లి తడి బట్టలతో ప్రమాణం చేశానని, ఎప్పుడు కావాలన్నా వచ్చి ప్రమాణం చేస్తాని బండి సంజయ్ అన్నారు. ఈ వ్యాఖ్యలు సీరియస్ గా తీసుకున్న కేటీఆర్.. అసత్యాలు ప్రచారం చేసినందుకు 48 గంటల్లో క్షమాపణ చెప్పాలని గడువిచ్చారు. కానీ నిర్ణీత సమయంలోగా బండి సంజయ్ చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోకపోవడం, తనకు క్షమాపణ చెప్పని కారణంగా కేంద్ర మంత్రికి లీగల్ నోటీసులు ఇచ్చారు.

వారికి కూడా లీగల్ నోటీసులు ఇస్తారా..

కరీంనగర్‌లో ఇటీవల మీడియాతో మాట్లాడిన బండి సంజయ్...  నేను ఏం తప్పు చేశాను. మీ చెల్లెలు కవిత కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పారు. ఆమెకు మీరు లీగల్ నోటీసులిస్తారా?. కేసీఆర్ చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశారని మాజీ పోలీస్ అధికారి రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో చెప్పడం నిజం కాదా. ఆయనకు కూడా కేటీఆర్ నోటీసులిస్తావా? అసలైన దోషులకు నోటీసులు ఇవ్వాలనుకుంటే తండ్రీకొడుకులు కేసీఆర్, ఆయన కొడుకు జీవితాంతం జైల్లోనే ఉంటారు. వాళ్లు మాట్లాడని బూతుల్లేవు. వాళ్లు చేయని తప్పులు లేవు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేయని అవినీతి లేదు. ఒక రాజకీయ నేతగా నిజాలు మాట్లాడిన తనకు నోటీసులిస్తే.. ఏం చేయాలో, వాటిని ఎదుర్కోవాలో తనకు తెలుసనని బండి సంజయ్ అన్నారు.