NTR Coin: మాజీ ముఖ్యమంత్రి, వెండితెర మేరునగధీరుడు ఎన్టీ రామారావు శతజయంతి వేళ ఆయన చిత్రంతో రూ.100 నాణెం తీసుకురానున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నాణెం ఆవిష్కరణ కార్యక్రమం ఆగస్టు 28వ తేదీన రాష్ట్రపతి భవన్ లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబసభ్యులతో పాటు 100 మందిని ఆహ్వానించారు. అయితే ఎన్టీ రామారావు భార్య అయిన లక్ష్మీ పార్వతికి మాత్రం ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందలేదు. దీంతో ఆమె రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. తనకు కూడా ఎన్టీఆర్ రూ.100 నాణెం ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానం ఇవ్వాల్సిందిగా లేఖలో విజ్ఞప్తి చేశారు. 


'నేను 11.09.1993 తేదీన స్వర్గీయ ఎన్టీ రామారావుతో వివాహం చేసుకున్నాను. మేమిద్దరం కలిసి ప్రశాంతమైన కుటుంబ జీవితాన్ని గడిపాము. 1994లో జరిగిన ఏపీ శాసనసభ ఎన్నికల్లో చురుగ్గా పాల్గొన్నాం. మా నాయకత్వంలో టీడీపీ పార్టీ 294 లో 226 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుుంది. ఎన్టీ రామారావు పెద్ద అల్లుడి(చంద్రబాబు నాయుడు) కుట్రతో, ఇతర కుటుంబసభ్యులతో కలిసి కుమ్మక్కై అధికారాన్ని సంపాదించుకున్నారు. ఇది ఎన్టీఆర్ ను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఆయన తన పిల్లల కుటుంబాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన 18.01.1996న ప్రాణాలు కోల్పోయారు. హాస్యాస్పదంగా ఆయన మరణానికి కారణమైన కుటుంబ సభ్యులనే ఇప్పుడు ఆయన జ్ఞాపకార్థం తీసుకువస్తున్న రూ.100 నాణెం ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఆయన చట్టబద్ధమైన వారసురాలినైన భార్యను (నందమూరి లక్ష్మీ పార్వతి) పట్టించుకోలేదు. దీనికి బాధ్యులైన అధికారులపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాను. ఈ నేపథ్యంలో 28.08.23 రోజున జరగబోయే రూ.100 నాణెం ఆవిష్కరణ కార్యక్రమానికి అతిథుల జాబితాలో నా పేరును కూడా చేర్చాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను' అంటూ లక్ష్మీ పార్వతీ రాష్ట్రపతికి లేఖ రాశారు. 


ఎన్టీఆర్ శత జయంతి  ఉత్సవాల సందర్భంగా నాణెం                                  


నందమూరి తారక రామారావు పేరుతో రూ.100 నాణేన్ని ఈ నెల 28న విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఆయన పేరుతో రూ.100 నాణేన్ని ముద్రించింది. అయితే ఈ నాణేన్ని ఆగస్టు 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ కార్యాలయం నుంచి ఈ మేరకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు 10 రోజుల క్రితం సమాచారం అందించింది.


Also Read: Chandrayaan-3: చంద్రయాన్-3 ల్యాండింగ్: ఆ రోజు పుట్టిన శిశువుకు చంద్రయాన్‌గా నామకరణం


ప్రత్యేక లోహాలతో నాణెం తయారీ                              


ఈ వంద రూపాయల ఈ కాయిన్ 44 మిల్లీమీటర్లు చుట్టుకొలతతో ఉండే ఈ నాణెంలో సుమారు 50 శాతం వెండి అలాగే 40 శాతం రాగీ ఉండనుంది.అలాగే ఐదు శాతం నికెల్ ఐదు శాతం లోహాలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో కూడిన అశోక చక్రం మరోవైపు ఎన్టీఆర్ చిత్రం దాని కింద శ్రీ నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీ,భాషలలో 1923-2023 అని ముద్రించినట్లుగా  ఆర్బీఐ తెలిపింది.