Chandrayaan-3: చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ తో భారత్ చరిత్ర లిఖించిన విషయం తెలిసిందే. ఏ దేశానికి కూడా సాధ్యంకాని రీతిలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో ఈ అద్భుతాన్ని సుసాధ్యం చేసింది. జాబిలి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండ్ అయిన తొలి దేశంగా బారత్ నిలిచింది. దేశ ప్రజలు తలెత్తుకునేలా, కాలరెగిరేసేలా చేసిన చంద్రయాన్-3 ల్యాండ్ అయిన రోజున పుట్టిన ఓ శిశువుకు చంద్రయాన్ గా నామకరణం చేశారు ఓ తల్లిదండ్రులు. ఒడిశాలోని కేంద్రపరా జిల్లా ఆస్పత్రిలో బుధవారం సాయంత్రం ముగ్గురు మగ శిశువులు, ఒక ఆడ శిశువు జన్మించారు. అందులో ఒక శిశువుకు చంద్రయాన్ గా పేరు పెట్టారు తల్లిదండ్రులు. చంద్రునిపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండ్ అయిన కొన్ని నిమిషాలకే పాప జన్మించిందని.. యావత్ దేశం గర్వించే ఈ అద్భుతమైన క్షణాన్ని మరింత ప్రత్యేకంగా ఉండేలా పాపకు చంద్రయాన్ అని నామకరణం చేసినట్లు ఆ శిశువు తల్లి ప్రవత్ మల్లిక్ తెలిపారు.
చంద్రయాన్-3 విజయవంతం కావడం ఎంతో మందిని గర్వపడేలా చేసిందని, చంద్రుని మిషన్ పేరు మీదుగా తమ శిశువులకు నామకరణం చేయడానికి మొగ్గు చూపుతున్నట్లు కేంద్రపారా జిల్లా ఆస్పత్రి హెడ్ నర్స్ అంజనా సాహూ తెలిపారు. చరిత్రలో నిలిచి పోయే ఆ సమయంలో తమ బిడ్డలు జన్మించడాన్ని చాలా మంది తల్లిదండ్రులు గర్వపడుతున్నారని జిల్లా ఆస్పత్రి అదనపు జిల్లా వైద్యాధికారి డాక్టర్ పి.కె. ప్రహరాజ్ పేర్కొన్నారు. తమ శిశువులకు చంద్రయాన్ మిషన్ పేరు మీదుగా నామకరణం చేసి మరింత ప్రత్యేకంగా జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
Also Read: Brics Summit 2023: బ్రిక్స్‌లో 6 దేశాలకు కొత్తగా సభ్యత్వం, కూటమి బలోపేతం అవుతుందన్న మోదీ
చంద్రయాన్ - 3 మిషన్ ఘన విజయం సాధించడంతో అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ చరిత్ర సృష్టించింది. బుధవారం రోజు సాయంత్రం 6.04 గంటలకు చందమామపై సాఫ్ట్ ల్యాండింగ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. విక్రమ్ ల్యాండ్ అయిన నాలుగు గంటల తర్వాత అంటే రాత్రి 10.04 గంటలకు రోవర్ బయటకు వచ్చింది. ల్యాండర్ లో పంపించిన రోవర్ పేరు ప్రజ్ఞాన్. ప్రస్తుతం జాబిల్లిపై అడుగు పెట్టిన ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడిపై తన అధ్యయనం మొదలు పెట్టింది. ఇప్పటికే ల్యాండర్ క్షేమంగా దిగడంతో భారత దేశ ప్రజలంతా ఘనంగా సంబురాలు చేసుకున్నారు. ఈక్రమంలోనే ఇస్రో అధికారులు తమ అధికారిక ట్విట్టర్ నుంచి ఓ ట్వీట్ చేసింది. చంద్రయాన్ - 3 రోవర్ చంద్రుడి కోసం భారతదేశంలో తయారు అయిందని చెప్పింది. అలాగే ల్యాండర్ నుంచి రోవర్ సజావుగా బయటకు వచ్చిందని వెల్లడించింది. మిషన్ కు సంబంధించిన మరిన్ని అప్ డేట్లను త్వరలోనే షేర్ చేస్తామని పేర్కొంది.
మైక్రోవేవ్ సైజులో ఉన్న ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై 500 మీటర్లు అంటే 1640 అడుగుల వరకు ప్రయాణించేలా రూపొందించారు. దీని బరువు 26 కిలోలు. రోవర్ లో కెమరా, స్పక్ట్రో మీటర్, మాగ్నెటో మీటర్ తో సహా అనేక రకాల పరికరాలతో అమర్చారు. ఇది చంద్రుడిపై వాతావరణం, భూగర్భం శాస్త్రం, ఖనిజ శాస్త్రం, చరిత్ర, స్థితిగతుల గురించి అధ్యయనం చేయడానికి ప్రయోగాలు చేస్తోంది.