పాతబస్తీలో అర్థరాత్రి అలజడి రేగింది. బీజేపీ బహిష్కృత నేత రాజాసింగ్‌కు వ్యతిరేంగా ఓల్డ్‌సిటీ యువత రగిలిపోతోంది. ఆయన్ని అరెస్టు చేయాలంటూ నిరసనలు, నినాదాలతో హోరెత్తించారు. అప్పటికే అలెర్ట్‌గా ఉన్న భద్రతా సిబ్బంది వారిని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. పరిస్థితి అదుపులోకి రాకపోయేసరికి లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ లాఠీఛార్జ్‌ సంఘటనలో యాభై మందికిపైగా గాయపడ్డట్టు తెలుస్తోంది. 


షాలిబండ ప్రాంతంలో అర్థరాత్రి కొందరు యువకులు హంగామా సృష్టించారు. గుంపులు గుంపులుగా రోడ్లపైకి వచ్చి బీజేపీకి, రాజాసింగ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని కంట్రోల్ చేసేందుకు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా మరికొందరు నినాదాలు చేశారు. మరికొందరు పోలీసులపైకి రాళ్లను కూడా విసిరారు. వారందర్నీ అదపు చేసిన పోలీసులు ఎక్కడి వారిని అక్కడే చెదరగొట్టారు. రాత్రి పాతబస్తీలో పర్యటించిన సీపీ సీవీ ఆనంద్‌ ఓల్డ్‌ సిటీలో పర్యటించారు. పరిస్థితిని సమీక్షించారు. 


 


ఇలాంటి పరిస్థితులు వస్తాయని ముందుగానే కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది ప్రభుత్వం. నిన్న సాయంత్రం శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్‌... పోలీసు ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కఠినమైన చర్యలు తీసుకోమని సూచించారు. సుమారు నాలుగు గంటలపాటు సాగిన భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. 


సీఎం ఆదేశాలతో పాతబస్తీపై స్పెషల్ ఫోకస్ పెట్టిన పోలీసులు ఉన్నతాధికారులు... భారీగా బలగాలను రంగంలోకి దించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడ్డారు. లోకల్‌పోలీసులతోపాటు ఆర్పీఎఫ్‌, సీఆర్‌ఫీఎఫ్‌తో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. 


పుకార్లను నమ్ముతూ యువత రెచ్చిపోవద్దని.. భవిష్యత్ నాశనం చేసుకోవద్దని సూచించారు అధికారులు. సమస్యలుంటే తమ దృష్టి తీసుకురావాలని హితవు పలికారు. ఈ జాగ్రత్తలు తీసుకుంటూనే ట్రాఫిక్‌ ఆంక్షలు కూడా విధించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎక్కువ రద్దీ లేకుండా చర్యలు చేపట్టారు. అలాంటి ప్రాంతాల్లో వెళ్లవలసిన వాళ్లకు ప్రత్యామ్నాయాలు సూచించారు. 


పురానాపూల్ బ్రిడ్జి, ఎంజే బ్రిడ్జి, నయాపూల్ బ్రిడ్జి, శివాజీ బ్రిడ్జి, చాద‌ర్‌ఘాట్ బ్రిడ్జి, చాద‌ర్‌ఘాట్ కాజ్‌వే, ముసారాంబాగ్ బ్రిడ్జి నుంచి ఓల్డ్ సిటీ, మ‌ల‌క్‌పేట్‌, ఎల్బీన‌గ‌ర్‌కు వెళ్లే వాహ‌న‌దారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సి వస్తోంది. ఎంజే మార్కెట్ నుంచి న‌యాపూల్ బ్రిడ్జి, ఎంజే బ్రిడ్జి, పురానాపూల్ బ్రిడ్జి నుంచి ఓల్డ్ సిటీకి వేళ్లే దారులు మూసేశారు. ఆ రూట్‌లో వెళ్ల వారిని 100 ఫీట్ రోడ్డు, జియ‌గూడ‌, రామ్‌సింగ్‌పురా, అత్తాపూర్, ఆరాంఘ‌ర్, మైలార్‌దేవ్‌ప‌ల్లి, చాంద్రాయ‌ణ‌గుట్ట మీదుగా మళ్లించారు. 


ఎంజే మార్కెట్ నుంచి న‌యాపూల్ బ్రిడ్జి, శివాజీ బ్రిడ్జి మీదుగా ఓల్డ్ సిటీకి చేరుకునే వారు.. రంగ‌మ‌హ‌ల్‌, చాద‌ర్‌ఘాట్‌, నింబోలి అడ్డ, టూరిస్ట్ జంక్షన్, బ‌ర్కత్పురా, ఫీవ‌ర్ హాస్పిట‌ల్‌, విద్యాన‌గ‌ర్‌, తార్నాక మీదుగా చేరుకోవాల్సి ఉంటుంది. అబిడ్స్, కోఠి నుంచి ఎల్బీన‌గ‌ర్‌, మ‌ల‌క్‌పేట్‌, దిల్‌సుఖ్‌న‌గ‌ర్ వెళ్లే వాహ‌న‌దారులు.. నింబోలిఅడ్డ, టూరిస్ట్ జంక్షన్, బ‌ర్కత్పురా, ఫీవ‌ర్ హాస్పిట‌ల్‌, విద్యాన‌గ‌ర్‌, తార్నాక లేదా 6 నంబ‌ర్, రామంతాపూర్ మీదుగా ప్రయాణించాలి. 


ఓల్డ్ సిటీ నుంచి అబిడ్స్, కోఠి, ఎంజే మార్కెట్‌, ల‌క్డీకాపూల్ వైపు వెళ్లాలంటే వేరే రూట్ చూసుకోవాల్సిందే. చాంద్రాయ‌ణగుట్ట, మైలార్‌దేవ్‌ప‌ల్లి, ఆరాంఘ‌ర్, అత్తాపూర్, మెహిదీప‌ట్నం, మాసాబ్‌ట్యాంక్‌, ల‌క్డీకాపూల్ మీదుగా చేరుకోవచ్చు. దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌, ఎల్బీన‌గ‌ర్ నుంచి అబిడ్స్, కోఠి, ఎంజే మార్కెట్ వెళ్లే వాహ‌న‌దారులు.. ఉప్పల్, తార్నాక‌, విద్యాన‌గ‌ర్, ఫీవ‌ర్ హాస్పిట‌ల్‌, బ‌ర్కత్పురా మీదుగా ప్రయాణించొచ్చు.