Lashkar Bonalu: హైదరాబాద్ లో అట్టహాసంగా సాగుతున్న బోనాల వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ లష్కర్ మహంకాళి అమ్మవారికి సీఎం కేసీఆర్ దంపతులు బోనం సమర్పించారు. సతీమణి శోభతో కలిసి అమ్మవారిని దర్శించుకున్న కేసీఆర్.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్ వెంట పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. అనంతరం మహంకాళి అమ్మవారికి ముఖ్యమంత్రి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ పద్మారావు నివాసంలో ముత్యాలమ్మ గుడిలో ముఖ్యమంత్రి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తొలి బోనం సమర్పించగా లష్కర్ బోనాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. బోనాల ఉత్సవాలు సోమవారం కూడా జరగనున్నాయి. 


ఎమ్మెల్సీ కవిత, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి బోనం సమర్పించారు. మరోవైపు కేంద్రమంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సీఎస్ శాంతికుమార్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీగా భక్తులు, వీఐపీల రాకతో మహంకాళి అమ్మవారి ఆలయం, పరిసరాలు కిక్కిరిసిపోయాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు ఆదివారం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి కుటుంబ సభ్యులు అమ్మవారికి బోనం సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. 


Also Read: Karnataka News: కూలీకి నిప్పంటించి హత్య చేసిన కిరాణ షాపు యజమాని, విచారణలో దొరకడంతో జైలుశిక్ష


తొలిబోనం సమర్పించిన మంత్రి తలసాని


ఉజ్జయినీ మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఆషాఢ బోనాల సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తొలి బోనం సమర్పించారు. ఆయన కుటుంబసభ్యులతో కలిసి ఇవాళ వేకువజామున 3.30 గంటలకే ఆలయానికి చేరుకుని, కుటుంబ సమేతంగా బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి కుటుంబానికి పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకొని మంత్రి, కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు.  ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మన సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. 2014 నుండి బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తూ వస్తుందని, బోనాలను ఘనంగా నిర్వహించుకోవాలి అనే ఉద్దేశంతోనే దేవాలయాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. ప్రైవేటు దేవాలయాలకు కూడా ఆర్థిక సహాయం అందిస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తలసాని అన్నారు. బోనాల సందర్భంగా వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తలసాని అన్నారు.


తెల్లవారుజాము నుంచే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు వరుస కట్టారు. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో జనాలు వస్తుండడంతో రద్దీ నెలకొనకుండా ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మొత్తం ఆరు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బాటా చౌరస్తా నుంచి ఆలయానికి వచ్చే లైను, ఎంజీ రోడ్డు రాంగోపాల్‌ పేట్‌ పాత పోలీస్‌ స్టేషన్‌ కొత్త ఆర్చి గేట్‌ నుంచి మహంకాళి పోలీస్‌ స్టేషన్‌ మీదుగా ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial