తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ కొడుకు హిమన్షు రావు కూడా తండ్రిలాగానే సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ చురుగ్గా ఉంటూ ఉండే సంగతి తెలిసిందే. ఈ ఏడాదే 12వ తరగతి పూర్తి చేసిన ఆయనకు ట్విటర్ లో 30 వేల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్ లో కూడా 30 వేలకు చేరువలో ఉన్నారు. కేసీఆర్, కేటీఆర్, టీఆర్ఎస్ అభిమానుల్లో చాలా మంది హిమాన్షును కూడా ఫాలో అవుతుంటారు.
అయితే, ఇటీవల హిమాన్షులో చాలా మార్పు కనిపించింది. గతంలో ఆయన అధిక బరువు కారణంగా నెట్టింట్లో బాడీ షేమింగ్‌కు గురైన విషయం తెలిసిందే. భారీ శారీరాకృతితో కనిపించిన హిమాన్షుపై ఆన్ లైన్‌లో ఎన్నో ట్రోట్స్ కూడా వచ్చాయి. ఆ మధ్య సీఎం కేసీఆర్‌ను ఏపీ సీఎం జగన్ కలిసినప్పుడు హిమాన్షు జగన్‌తో దిగిన ఫోటో బాగా వైరల్ అయింది. అయితే, దీనిపై కొన్ని సందర్భాల్లో తీవ్రంగా స్పందించిన మంత్రి కేటీఆర్ తన కుమారుడిపై కొందరు అసభ్యకరంగా మాట్లాడుతున్నారని అన్న సందర్భాలూ ఉన్నాయి. కొంత మంది రాజకీయ నాయకులు కూడా ప్రెస్ మీట్లలో విమర్శించిన సందర్భాలు ఉన్నాయి.
ఆ తర్వాత ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టిన హిమాన్షు బాగా బరువు తగ్గారు. యాదాద్రి ఆలయ పున:ప్రారంభోత్సవం, ప్రగతి భవన్ లో పంద్రాగస్టు వేడుకలు, ఇతర సందర్భాల్లో ఫోటోల్లో కనిపించిన హిమాన్షు రావులో చాలా మార్పు కనిపించింది. అంతకుముందుతో పోల్చితే చాలా బరువు తగ్గారు.
గత నెల అక్టోబరులో ఖాజాగూడ గవర్నమెంట్ స్కూల్ విద్యార్థుల కోసం యునైటెడ్ నేషన్స్ వారి సస్టెనబుల్ డెవలప్ మెంట్ గోల్స్ అనే అంశంపై మాట్లాడే అవకాశం హిమాన్షు రావుకు వచ్చింది. దానికి సంబంధించిన ఫోటోలను ఆయన ట్వీట్ చేయగా, అందులోనూ సన్నగా కనిపించారు.
తాజాగా, ఇప్పటి ఫోటోల్లో చూస్తే అసలు పాత ఫోటోల్లో వ్యక్తికి అస్సలు సంబంధం లేనట్లుగా కనిపిస్తున్నారు. ఓ ఫోటోను ఓ అభిమాని ట్వీట్ చేస్తూ అచ్చం కేటీఆర్ లా ఉన్నారు అంటూ ట్వీట్ చేశారు. ‘‘నేను సడెన్ గా చూసి కేటీఆర్ అన్న అనుకున్నా’’ అని ట్వీట్ చేసి హిమాన్షుని ట్యాగ్ చేశారు. దీనిపై హిమాన్షు స్పందిస్తూ ట్రెండింగ్ లో ఉన్న బాలక్రిష్ణ డైలాగ్ తో సమాధానం ఇచ్చారు.
‘‘సరిసర్లే ఎన్నెన్నో అనుకుంటాం.. అన్ని జరుగుతాయా ఏంటి? అని ఓ గ్రేట్ మ్యాన్ చెప్పారు.. జోక్స్ చేశా, థ్యాంక్యూ’’ అని సమాధానం ఇచ్చారు. దీంతో ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలకృష్ణ డైలాగ్ తో చేసిన పోస్ట్ కు బాలయ్య నా మాజాకా.. డైలాగ్ ఎవరైనా వాడాల్సిందే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.