Amazon Prime Air : అమెజాన్ ఇక సొంత విమానాల్లో సరుకుల డెలివరీ చేయబోతోంది. వినియోగదారులకు శరవేగంగా బుకింగ్స్ డెలివరీ చేసేందుకు అమెజాన్ ప్రైమ్ ఎయిర్ ను ఆ సంస్థ హైదరాబాద్ లో ప్రారంభించింది. ఇప్పటి వరకూ అమెరికా, యూరప్‌లలో మాత్రమే ప్రైమ్ ఎయిర్ సౌకర్యాన్ని ఆమెజాన్ ప్రారంభించింది. మూడో దేశంగా ఇండియాలో అదీ ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ప్రారంభించింది. మంత్రి కేటీఆర్ శంషాబాద్ విమానాశ్రయంలో అమెజాన్ ఎయిర్‌కార్గో విమానమైన ప్రైమ్ ఎయిర్‌ను ప్రారంభించారు.
తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతోందన్న కేటీఆర్
ఆ తర్వాత మాట్లాడిన కేటీఆర్ తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో తెలంగాణ రెండో స్థానంలో ఉన్నదని చెప్పారు. గత ఏడేండ్లుగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమెజాన్ బృందాన్నికేటీఆర్ అభినందించారు. అమెజాన్ అతిపెద్ద క్యాంపస్ హైదరాబాద్‌లోనే ఉందని చెప్పారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా రూ.36,300 కోట్ల పెట్టుబడులు పెడుతున్నదని చెప్పారు.ఏవియేషన్ రంగంలో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని వెల్లడించారు. హైదరాబాద్ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్‌పోర్ట్ అని చెప్పారు. హైదరాబాద్ గ్రీన్‌సిటీ అవార్డును సొంతం చేసుకున్నదని తెలిపారు.
అమెరికా, యూరప్ తర్వాత ఇండియాలోనే ప్రైమ్ ఎయిర్
అమెరికా, యూరప్ తర్వాత భారతదేశంలో అమెజాన్ ఎయిర్‌ను కంపెనీ పరిచయం చేసింది. ఇందులో భాగంగా ఈ-కామర్స్ దిగ్గజం బోయింగ్ 737-800 విమానాల పూర్తి కార్గో సామర్థ్యాన్ని ఉపయోగించాలని నిర్ణయించింది. దీని ద్వారా ముంబై, బెంగళూరు, హైదరాబాద్, దిల్లీ నగరాల్లో వేగవంతమైన డెలివరీలను అందించే అవకాశం ఉంది. కంపెనీ ప్రారంభిస్తున్న ఈ సర్వీస్ రవాణా నెట్‌వర్క్‌ను మెరుగుపరచటంతో పాటు డెలివరీల వేగవంతాన్ని సులభతరం చేస్తుంది.
వేగంగా డెలివరీలు ఇచ్చేందుకు అమెజాన్ ప్రయత్నాలు
వాయువేగంతో వ్యాపారంలో ముందుకు సాగేందుకు అమెజాన్ బెంగుళూరుకు చెందిన కార్గో ఎయిర్‌లైన్ క్విక్‌జెట్‌తో జతకట్టింది. అలా కంపెనీ తన తొలి ఎయిర్ ఫ్రైట్ సర్వీసును ప్రారంభించింది. డెలివరీల కోసం ప్రత్యేకమైన ఎయిర్ నెట్‌వర్క్‌ను అందించడానికి థర్డ్-పార్టీ క్యారియర్‌తో భాగస్వామిగా మారిన ఈ-కామర్స్ కంపెనీగా అమెజాన్ మారింది. డెలివరీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడానికి కంపెనీ తన పెట్టుబడుల స్పీడ్ కొనసాగిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఫుల్‌ఫైల్‌మెంట్ సెంటర్‌ల నుంచి లాస్ట్-మైల్ డెలివరీలకు సరుకులను వేగంగా రవాణా చేయడంలో ఈ చర్యలు దోహదపడతాయని స్పష్టం చేసింది.