BRS Foundation Day: ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఆవిర్భవించిన ఒకప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి నేటి భారత రాష్ట్ర సమితి ప్రస్తానం ప్రారంభమైన నేటికి 22 ఏళ్లు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసి రాష్ట్రాన్ని సాధించి దేశం దృష్టిని ఆకర్షించింది. రెండు పర్యాయాలు అధికారం చేపట్టి సంచలన నిర్ణయాలు తీసుకొని మరింత మందిని ఆకట్టుకుంది. అదే స్ఫూర్తితో దేశంపై దృష్టి పెట్టి టీఆర్‌ఎస్ కాస్త బీఆర్‌ఎస్‌గా మారింది. ఇప్పుదు ఢిల్లీ గద్దెపై స్థానం కోసం ప్రణాళికలు రచిస్తోంది. 


2001 ఏప్రిల్‌ 27న జలదృశ్యం వద్ద ఎగరేసిన గులాబీ జెండాను ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎగరేయాలన్న సంకల్పంతో పార్టీ శ్రేణులు కృషి చేయాలని బీఆర్‌ఎస్ నేతలు పిలుపునిస్తున్నారు. దీనికి తెలంగాణ ప్రజల ఆశీర్వాదాలు కావాలని కోరుతున్నారు. పార్టీ ఆవిర్భావ సందర్భంగా నాటి ఉద్యమాలు, జరిగిన పరిణాలు, చూసిన వచ్చిన చరిత్రను నేతలు గుర్తు చేసుకుంటున్నారు. నేటి తరానికి వాటిని తెలియజేస్తున్నారు. 


ఆవిర్భావం నుంచి నేటి వరకు బీఆర్‌ఎస్‌ను గుండెల్లో దాచుకున్న పార్టీ శ్రేణులకు తెలంగాణ ప్రజలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన బీఆర్‌ఎస్‌ తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని పునఃప్రతిష్టించిందని అన్నారు. ఉద్యమ సమయంలోనూ పాలనా నైపుణ్యంతో దేశానికే కేసీఆర్ ఆదర్శంగా నిలిచారని కితాబు ఇచ్చారు. దీనికి సహకరించిన వారికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. 






కేటీఆర్ ఇంకా ఏమన్నారంటే... రెండు దశాబ్ధాల క్రితం ఉద్యమపార్టీకి పురుడుపోసి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని పునః ప్రతిష్టించి తక్కువ కాలంలోనే తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపిన నేత కేసీఆర్. 22 ఏళ్ల ప్రస్థానంలో నాటి నుంచి నేటి వరకు బీఆర్‌ఎస్‌కి అండగా ఉంటున్న పార్టీ శ్రేణులకు, తెలంగాణ ప్రజలకు బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ శుభాకాంక్షలు ’ అని చెబుతూ ట్వీట్ చేశారు. 


స్వరాష్ట్ర సాధన కోసం నాడు టీఆర్ఎస్.... ఉజ్వల భారత్‌ కోసం నేడు బీఆర్‌ఎస్‌ అంటూ ట్వీట్ చేశారు మంత్రి హరీష్ రావు. కేసీఆర్ సారథ్యంలో 22ఏళ్ల క్రితం పురుడు పోసుకున్న ఉద్యమ పార్టీ, స్వరాష్ట్ర గమ్యాన్ని ముద్దాడి నేటి బంగారు తెలంగాణకు బాటలు వేసిందన్నారు. అనతి కాలంలోనే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన పార్టీగా నిలిచి, దేశానికే రోల్ మోడల్ అయ్యిందని పోస్ట్ చేశారు. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నాంది పలికిందని కితాబు ఇచ్చారు. 9 ఏళ్లలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపిన కేసీఆర్, తెలంగాణ అభివృద్ధి మోడల్ ను దేశవ్యాప్తం చేసేందుకు బయలుదేరారని చెప్పారు హరీష్ రావు. దేశ అభివృద్ధి కోసం తెలపెట్టిన మహాయజ్ఞం జాతీయ స్థాయిలో విస్తరించి, మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, దేశవిదేశాల్లోని 'గులాబీ' అభిమానులకు పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు హరీష్‌.







ఎమ్మెల్సీ కవిత కూడా పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ట్వీట్ చేసిన కవిత... కేసీఆర్ నాయకత్వంలో పిడికెడు మందితో ప్రారంభమై రాష్ట్రాన్ని సాధించామన్నారు. అప్పటి నుంచి తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపామన్నారు. ఇప్పుడు దేశ ప్రగతి కోసం రైతు రాజ్యం కోసం వడివడిగా అడుగులు వేస్తున్నామని ఈ సందర్భంగా పార్టీ కుటుంబ సభ్యులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. తెలంగాణ విముక్తి కోసం ఆనాడు.. భరతమాత బంగారు భవిష్యత్ కోసం ఈనాడు అంటూ పోస్టు చేశారు.