Govt Jobs in Telangana: ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు మాది భరోసా అని మంత్రి కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Telangana Elections 2023 Results) విడుదలైన మరుసటిరోజే ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువకులతో హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో ప్రత్యేకంగా సమావేశం అవుతానని కేటీఆర్ తెలిపారు. అశోక్ నగర్ తో పాటు పలు యూనివర్సిటీలలో ప్రభుత్వం ఉద్యోగాలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కేటీఆర్ ని కలిశారు. ఆ తర్వాత ప్రభుత్వ నియామకాలకు సంబంధించిన పలు అంశాల పైన మంత్రి కేటీఆర్ తో చర్చించారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక సాధ్యమైనంత త్వరగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని వారికి భరోసా ఇచ్చారు.


ఉద్యోగాల భర్తీపై నెలకొన్న సమస్యలపై చర్చించేందుకు డిసెంబర్ 4వ తేదీన 10 గంటలకి అశోక్ నగర్ లో ప్రభుత్వ ఉద్యోగార్థులతో సమావేశం అవుతానని వారికి కేటీఆర్ (Telangana Minister KTR) భరోసా ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో తమ నిబద్ధతను ఎవరు ప్రశ్నించే అవకాశం లేదని... ముఖ్యంగా సంవత్సరానికి 1000 ఉద్యోగాలు కూడా కల్పించని కాంగ్రెస్ పార్టీకి అసలే లేదన్నారు. యువతకు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీకి రెట్టింపుకు పైగా 2 లక్షల 30 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇందులో ఇప్పటికే 1,62,000 పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. 


దేశంలో గత 10 సంవత్సరాలలో తెలంగాణను మించి ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏదీ లేదన్నారు. తమపై కేవలం రాజకీయ దురుద్దేశంత ఉంచుకొని విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు ఈ విషయంలో రాష్ట్ర యువకులకు సమాధానం చెప్పాలన్నారు. గత 10 సంవత్సరాలలో తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలను ఇచ్చినట్లయితే, తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు యువకులకు గణాంకాలతో సహా వివరించాలని సవాలు చేశారు. రాష్ట్ర యువకులు విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ తన స్వార్ధ రాజకీయాల కోసం ఈ అంశం పైన చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టి నిజాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాల తాలూకు వివరాల జాబితాను, ప్రస్తుతం భర్తీ చేస్తున్న ఉద్యోగాల ప్రక్రియ వివరాలను గణాంకాలతో సహా అందించారు. 


మంత్రి కేటీఆర్ తమతో ఉద్యోగాల భర్తీపై మాట్లాడటంపై ప్రభుత్వ ఉద్యోగార్థులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఉద్యోగాలను ఇచ్చినప్పటికీ నియామక ప్రక్రియకు సంబంధించిన కొన్ని సమస్యల వలన యువతలో ఆందోళన నెలకొందన్నారు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోస్టుల సంఖ్యను మరింతగా పెంచాలని వారు కేటీఆర్ కు విజ్ఞప్తి చేశారు. పోస్టుల భర్తీ ప్రక్రియ, రోస్టర్ పాయింట్ల కేటాయింపు, విద్య అర్హతల విషయంలో ఉన్న కొన్ని సమస్యలను సులభంగా పరిష్కరించే అవకాశం ఉందన్నారు. సాంకేతికపరమైన అంశాల ఆధారంగా అనేక న్యాయపరమైన కేసులు ఎదురవుతున్నాయని, వీటి వలన భర్తీ ప్రక్రియకు ఆటంకం కలుగుతుందని తెలిపారు. 


ఉద్యోగార్థులు చెప్పిన సలహాలు సూచనలలపై సానుకూల దృక్పథంతో ముందుకు తీసుకెళ్తామని కేటీఆర్ తెలిపారు. మరిన్ని ఉద్యోగాలు పెంచాలన్న విద్యార్థుల సూచన మేరకు గ్రూప్-2 ఉద్యోగాలను పెంచి వెంటనే నోటిఫికేషన్లు కూడా జారీ చేస్తామన్నారు. కచ్చితంగా అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేస్తామని భరోసా ఇచ్చారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనితీరు విషయంలో విద్యార్థుల ఆకాంక్షలకు అనుకూలంగా పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న సుమారు 60 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తామన్నారు. వివిధ నోటిఫికేషన్లు, భర్తీ ప్రక్రియ పై ఉన్న కోర్టు కేసుల విషయంలో ప్రభుత్వం తరఫున అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.


ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసిన అనుభవం తనకు ఉన్నదని, అది ప్రభుత్వ ఉద్యోగమైన, ప్రైవేట్ ఉద్యోగమైన దాన్ని సాధించేందుకు తర్వాత దాని నిర్వర్తించేందుకు ఎదురయ్యే సవాళ్లు అర్థం చేసుకుంటానన్నారు. ఎన్నికలు ముగిసిన మరుసటిరోజే యువకులతో హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో ఉద్యోగార్థులతో పాటు విద్యార్థులతో ఒక విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి వారి సలహాలు తీసుకుంటామన్నారు. యువకుల ఆకాంక్షలకు అనుగుణమైన ఒక విధానపరమైన నిర్ణయాన్ని తీసుకుంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు.